Sugar Price: చక్కెర ధరలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర చక్కెర పరిశ్రమ, చెరకు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కిలో చక్కెరను కేవలం రూ.52కే విక్రయిస్తోంది. లక్నోలోని లాల్ బహదూర్ శాస్త్రి చెరకు రైతు సంస్థాన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రం ద్వారా వినియోగదారులు ఈ ధరకు చక్కెరను కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది. తాజాగా వినియోగదారుల కోసం వివిధ పరిమాణాల్లో ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కిలో ప్యాకెట్ ధర రూ.52 కాగా, రెండు కిలోల ప్యాకెట్‌ను రూ.102కు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 5 కిలోల ప్యాకెట్ ధర రూ.250గా, 50 కిలోల ప్యాకెట్ ధర రూ.2,500గా నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ ప్రత్యేక విక్రయాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినియోగదారులు చెరకు రైతు సంస్థాన్ ప్రాంగణంలోని విక్రయ కేంద్రానికి వెళ్లి చక్కెరను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. ఇప్పటికే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చక్కెర ధరల్లో కొంత తగ్గుదల నమోదైంది. ప్రభుత్వ తాజా చర్యల ప్రభావంతో వారం రోజుల్లో సగటు అఖిల భారత రిటైల్ చక్కెర ధర 3.85 శాతం తగ్గి కిలోకు రూ.62.57కు చేరింది. అంతకుముందు వారం కిలో చక్కెర సగటు ధర రూ.65.08గా ఉంది. అయితే గత నెలలో నమోదైన కిలోకు రూ.49.33తో పోలిస్తే ప్రస్తుతం ధర ఇంకా సుమారు 27 శాతం అధికంగానే ఉంది. మరోవైపు సగటు హోల్‌సేల్ ధర కూడా తగ్గింది. వారం క్రితం కిలోకు రూ.60.39గా ఉన్న చక్కెర హోల్‌సేల్ ధర సెప్టెంబర్ 2 నాటికి రూ.57.62కు పడిపోయింది.
హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు తగ్గిన వెంటనే ఆ ప్రభావం రిటైల్ మార్కెట్‌పై కనిపించకపోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన స్టాక్‌ను రిటైలర్లు వెంటనే తక్కువ ధరకు విక్రయించేందుకు ఆసక్తి చూపరు. దీంతో పాత స్టాక్ పూర్తయ్యే వరకు పాత ధరలే కొనసాగించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక రిటైలర్ వద్ద 50 కిలోల చొప్పున 10 నుంచి 15 చక్కెర బస్తాలు స్టాక్‌లో ఉంటాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ ధరకు కొత్త స్టాక్ కొనుగోలు చేసిన తర్వాతే రిటైల్ ధరల్లోనూ తగ్గుదల స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. రిటైల్ ధరలు మారడానికి కనీసం పది రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 10 లక్షల టన్నుల చక్కెర దిగుమతులకు అనుమతి ఇవ్వడంతో పాటు.. హోల్‌సేల్ కొనుగోలుదారులు, డీలర్లు నిల్వ చేసుకునే చక్కెర నిల్వలపై నిబంధనలను కఠినతరం చేసింది. దేశంలో చక్కెర నిల్వలు సరిపడా ఉన్నాయని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 2025 – 26 మార్కెటింగ్ సంవత్సరానికి చక్కెర ఉత్పత్తి అంచనాను గతంలో 343 లక్షల టన్నుల నుంచి 306 లక్షల టన్నులకు తగ్గించింది. దేశీయంగా ఏడాదికి సుమారు 280-285 లక్షల టన్నుల చక్కెర అవసరం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో కిలో చక్కెరను రూ.52కే అందుబాటులోకి తీసుకురావడం వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశంగా చెబుతున్నారు.

