Vande Bharat Express: భారత ప్రభుత్వం ప్రజల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి జరిగింది. కొత్తగా ప్రారంభించిన డెహ్రాడూన్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీ-డెహ్రాడూన్ మార్గంలో ముజఫర్‌నగర్ స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ E1 కోచ్‌పై రాళ్ల దాడి జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)ని మోహరించింది. ఈ మార్గంలో వందేభారత్ రైలును గత నెలలో ప్రధాని మోడీ ప్రారంభించారు.
Read Also: Karnataka Anna Bhagya : తలపట్టుకుంటున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. కేసీఆర్ కు ఫోన్ చేసి
ఈ ఏడాది ఇది ఏడో దాడి. ఇంతకుముందు కూడా పలుమార్గాల్లో వందే భారత్ రైలుపై ఆకతాయిలు కావాలని దాడులకు తెగబడ్డారు.
జనవరి నెలలో విశాఖపట్నం వందేభారత్ రైలుపై ఇలానే కంచరపాలెం వద్ద రాళ్లదాడి జరిగింది. ఈ ఘటనలో అద్దాలు పగిలిపోయాయి. రైలు ట్రయల్స్ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఏడాది జనవరిలో డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతానికి సమీపంలో రెండు కోచ్‌లపై రాళ్లు రువ్వడంతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. ఇదే నెలలో మాల్దా సమీపంలో హౌరా-న్యూ జల్పాయ్ గురి వందేభారత్ ట్రైన్ పై దాడి చేశారు. మార్చి 12 పశ్చిమ బెంగాల్ వందేభారత్ ట్రైన్ పై ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా వద్ద దాడి జరిగింది. ఏప్రిల్ 6న విశాఖ ట్రైన్ పై రాళ్లు రువ్వారు. మేలో కేరళలోని వందేభారత్ ట్రైన్ పై దాడి చేశారు.