Site icon NTV Telugu

Hardeep Singh Puri: రాహుల్ గాంధీ 2029,2034 ఎన్నికల కోసం సిద్ధం కావాలి..

Hardeep Singh Puri

Hardeep Singh Puri

Hardeep Singh Puri: లోక్‌సభ ఎన్నికల అనంతరం వెలువడిని అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఈ సారి అధికారం మళ్లీ ఎన్డీయే కూటమిదే అని, ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వస్తున్నారని అంచనా వేశాయి. అయితే, మరోవైపు ఇండియా కూటమి 295+ స్థానాలను గెలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజు మీడియా ఎగ్జిట్ పోల్స్ గురించి రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ఇవన్నీ మోడీ మీడియా పోల్స్ అని తాము 295 సీట్లు సాధిస్తామని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే భారీ విజయం సాధిస్తుందని చెప్పాయి, కాంగ్రెస్ నేతలు 2029, 2034 ఎన్నికల కోసం ప్రిపేర్ కావడం మంచిదని ఎద్దేవా చేశారు. ఫలితాలు వెలువడిన తర్వాత మల్లికార్జున ఖర్గే చెప్పిన 295 సీట్ల ఫలితాలు ఆవిరైపోతాయని అన్నారు. ‘‘ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని భావిస్తే, మరింత ఎక్కువ భ్రమలు, ఆత్మవిశ్వాసంలో మునిగిపోవడానికి మరో 48 గంటలు ఇవ్వండి. ఆపై అతను జూన్ 4న వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకుంటారు’’ అని హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఒకే దిశను సూచిస్తున్నాయని ఆయన అన్నారు. 2014, 2019 సంవత్సరాల అనుభవాన్ని ఉటంకిస్తూ, బీజేపీ 340 సీట్లకు పైగా సాధిస్తుందని తాను విశ్వసిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని, పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి కూడా ఇదే పరిస్థితి అని అన్నారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ.. ‘‘అతను ఇంకా యంగ్, 2029, 2034 ఎన్నికల కోసం ఎదురు చూడాలి’’ అని అన్నారు.

Read Also: Pune Porsche crash: పూణే కార్ యాక్సిడెంట్‌లో కీలక పరిణామం.. మద్యం తాగి నడిపినట్లు ఒప్పుకున్న మైనర్..

నిన్న విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 350 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుందని అంచనా వేశాయి. 1951-52 తర్వాత వరసగా మూడోసారి రావడం ఖాయమని స్పష్టం చేశాయి. కర్ణాటక, మహారాష్ట్రలలో ఎన్డీయే ఆధిపత్యాన్ని, కేరళలో వామపక్షాల నేతృత్వంలోని కూటమి ఓటమిని అంచనా వేసింది. బెంగాల్‌లో, ఎగ్జిట్ పోల్స్ గత సారి (22) కంటే బిజెపికి మెరుగైన పనితీరును అంచనా వేసింది. లోక్‌సభ స్థానాల పరంగా చూస్తే బెంగాల్‌లో బీజేపీ ఇప్పుడు అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చాలా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే సాధించే స్థానాలు.. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా (361 -401), న్యూస్ 24-టుడేస్ చాణక్య (400), ఎబిపి న్యూస్-సి ఓటర్ (353-383), రిపబ్లిక్ భారత్- పి మార్క్ (359), ఇండియా న్యూస్- డి-డైనమిక్స్ (371), రిపబ్లిక్ భారత్- మ్యాట్రిజ్ (353- 368), దైనిక్ భాస్కర్ (281-350), న్యూస్ నేషన్ (342-378), టైమ్స్ నౌ-ETG (358), ఇండియా TV- CNX (362-392) మరియు జన్ కీ బాత్ ( 362-392) అంచనా వేశాయి.

Exit mobile version