Site icon NTV Telugu

సీబీఎస్ఈ పాఠ్యాంశాలను తొలగించాలి : ఎస్టీఎఫ్ఐ

భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుస్మృతి ని మళ్ళీ ఆచరణలో పెట్టేందుకు జరుగుతున్న పెద్దకుట్రనే సీబీఎస్ఈ సిలబస్ లో మహిళల ఎదుగుదలపైన చేసిన వ్యాఖ్యలని పేర్కొంటూ, వాటిని ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశం తీవ్రంగా ఖండించింది. విద్యా విషయక పాఠ్యాంశాల్లో ఆధిపత్య, అహంకార భావజాలాలను ప్రవేశపెట్టి మహిళలను కించపరుస్తూ అన్ని సమస్యలకూ మూలం మహిళలే అని ప్రచారం చేయడం అప్రజాస్వామిమని, రాజ్యాంగ మౌలిక లక్ష్యమైన లింగ సమానత్వాన్ని గౌరవించని వ్రాతలకు పాఠ్యాపుస్తకాల్లో అవకాశం కల్పించాలని ఎస్టీఎఫ్ఐ డిమాండ్ చేసింది. భారత పాఠశాల ఉపాధ్యాయుల సమాఖ్య (ఎస్టీఎఫ్ఐ) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా బుధవారం నాడు ఎస్టీఎఫ్ఐ కేంద్ర కార్యవర్గ సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు అభిజిత్ ముఖర్జీ అధ్యక్షతన హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.

ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రధాన కార్యదర్శి సీఎన్ భారతి మాట్లాడుతూ కేంద్రీకరణ, వ్యాపారీకరణలకు ఆస్కారం కల్పిస్తున్న జాతీయ విద్యా విధానం 2020ని సమూలంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయత పేరుతో పాఠశాలల స్థాయిలో విద్యార్థుల పసి మెదడులను కలుషితం చేసి ప్రజల మధ్య ఐక్యతకు చిచ్చుపెట్టే విధంగా కేంద్ర పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ కారణంగా విద్యావ్యవస్థకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత శ్రద్ధ వహించాలని కోరారు. గురువారం జరగనున్న జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించే పలు తీర్మానాలను కార్యవర్గ సమావేశంలో చర్చించి ఆమోదించారు.

Exit mobile version