NTV Telugu Site icon

SpiceJet-Fact Check: ఇండియాలో అందరూ ప్రేమించే, భయపడే ఎయిర్ లైన్స్?

Sj

Sj

ఇండియాలో అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్‌ స్పైస్‌జెట్ అని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) అజయ్‌సింగ్‌ చెప్పుకున్నారు. ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టరే (పీఎల్ఎఫ్‌) దీనికి నిదర్శనమని చెప్పారు. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 80 శాతానికి పైనే సీట్లు నిండాయని వెల్లడించారు. తమపై నమ్మకం ఉంచినందుకు ప్రయాణికులకు ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న బుధవారం ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఫుల్‌ పేజీ యాడ్‌ కూడా ఇచ్చారు. అందులో ఈ సంస్థ ఏం పేర్కొందంటే..

మన దేశంలో వరుసగా ఏడేళ్లు అత్యధిక ఆక్యుపెన్సీని నమోదు చేసిన విమానయాన సంస్థ మాదే. హయ్యస్ట్‌ ఆక్యుపెన్సీని సాధిస్తూ నేటితో 84 నెలలు (7 సంవత్సరాలు) పూర్తి చేసుకున్నాం. ప్రపంచ వైమానిక చరిత్రలో ఈ ఫీట్‌ని ఇంతవరకు ఎవరూ సాధించలేదు. ప్రతి సంవత్సరం ఫ్లైట్లు ఎక్కుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మేం ఇదే ఉత్సాహంతో ఈ దేశ ప్రజల ఆకాశయానానికి రెక్కలు తొడుగుతాం. మా విమానాలతో 58 దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతున్నాం.

రీజనల్‌ కనెక్టివిటీ స్కీమ్‌ ‘ఉడాన్‌’లో అతిపెద్ద ఆపరేటర్‌గా నిలిచాం. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ఆపరేషనల్‌ సేఫ్టీ ఆడిట్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉన్నాం. మా జర్నీ ప్రారంభమై ఇప్పటికి 17 ఏళ్లు. ఈ సుదీర్ఘ కాలంలో ఒకటిన్నర బిలియన్‌ కిలో మీటర్లు ప్రయాణించాం. 18 కోట్ల మంది ప్యాసింజర్లను సంతోషంగా గమ్య స్థానాలకు చేర్చాం. ఇదీ.. స్పైస్‌ జెట్‌ తన వాణిజ్య ప్రకటనలో చెప్పుకున్న గొప్ప సంగతులు. కానీ.. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నిజం చెప్పాలంటే నాణేనికి మరో వైపు ఈ సంస్థ పెర్ఫార్మెన్స్‌ అంత బాగేం లేదు.

గత 24 రోజుల్లో 9 సార్లు స్పైస్‌ జెట్‌ విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ బయటపడ్డాయి. అంటే సాంకేతికపరంగా ఈమధ్య కాలంలో ఒడిదుడుకులకు లోనవుతోంది. దీంతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) స్పైస్‌ జెట్‌కి షోకాజ్‌ నోటీసు కూడా ఇచ్చింది. సురక్షితమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన విమాన సేవలు అందించడంలో విఫలమయ్యారని, దీనికి ఏం సమాధానం చెబుతారని అడిగింది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పైస్‌ జెట్‌ (ఎండీ) అజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఈ సాంకేతిక లోపాలు చాలా చిన్నవని, ప్రతి ఎయిర్‌లైన్స్‌కీ సహజమేనని చెప్పారు.

అంటే పరోక్షంగా లైట్‌ తీసుకోమని చెప్పారు. ప్రతి విమానాన్నీ జర్నీకి ముందు క్షుణ్ణంగా చెక్ చేస్తామని, ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉంటామన్నారు. సమీప భవిష్యత్తులో స్పైస్‌ జెట్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలేమీ తలెత్తకపోతే ఈయన చెప్పిన మాటలను స్వాగతించొచ్చు. లేకపోతే ‘అందరూ ప్రేమించే ఎయిర్‌లైన్స్‌’ అనే మంచి పేరుకు ‘అందరూ భయపడే ఎయిర్‌లైన్స్‌’ అనే చెడ్డ పేరునూ ముట్టగట్టుకోవాల్సి వస్తుందేమో.