Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎంకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) సమన్లు జారీ చేయడం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సమన్లు జారీ అయిన తర్వాత పలు విపక్షాలు ఆయనకు మద్దతుగా నిలబడుతున్నాయి. ఇదిలా ఉంటే సీబీఐ సమన్ల నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చాడు. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
Read Also: CAPF constable exam: 13 ప్రాంతీయ భాషల్లో CAPF కానిస్టేబుల్ పరీక్ష…
ఇప్పటికే ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నాడు. తాజాగా సీఎంకు సీబీఐ సమన్లు జారీ చేయడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత నెలకొంది. రేపు ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. అబద్ధపు ఆరోపణలు, సాక్ష్యాలతో సీబీఐ, ఈడీలు తప్పుడు కేసులు బనాయిస్తున్నాయని, ఆ అధికారులపై మేము కేసులు నమోదు చేస్తామని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. నిన్ను దోషిగా తేలిస్తే కోర్టులపై కూడా కేసులు వేస్తారా..? అని ప్రశ్నించారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, మేము చట్టబద్ధమైన పాలనను విశ్వసించామని.. ఈడీ, సీబీఐకి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తారా..? అప్పుడు కోర్టు కూడా మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే, కోర్టుకు కూడా మీరు వ్యతిరేకంగా వెళ్తారా..? అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రేపు కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయానికి వెళ్తుండటంతో అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి.