NTV Telugu Site icon

Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్‌ని అప్పగించాలని కోరాం, కెనడా స్పందించలేదు: భారత్..

Lawrence Bishnoi

Lawrence Bishnoi

Lawrence Bishnoi: కెనడా, ఇండియాల మధ్య దౌత్య ఉద్రిక్తలు పెరిగాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని గతేడాది ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్యూడో ఆరోపించాడు. దీనిని అసంబద్ధ వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో కెనడాలోని భారత రాయబారులకు సంబంధం ఉందని ముఖ్యంగా, భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో సహా ఆరుగురి ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించడంతో భారత్ ఫైర్ అయింది. కెనడా నుంచి తన రాయబారుల్ని ఉపసంహరించుకోవడంతో పాటు భారత్ లోని కెనడా రాయబారుల్ని మీ దేశానికి వెళ్లాలని ఆదేశించింది.

ఇదే కాకుండా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వివరాలను ఈ రాయబారులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి పంపిస్తున్నారంటూ అక్కడి పోలీసులు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కెనడా పీఎం ట్రూడో కూడా నిజ్జర్ హత్యలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపించాడు. అయితే, కెనడా ఆరోపణలపై భారత్ ప్రతీసారి సాక్ష్యాలు సమర్పించాలని కోరినా.. కెనడా ఈ పని చేయలేదు. తాజాగా ట్రూడో తమ వద్ద గట్టి సాక్ష్యాలు లేవని ఒప్పుకున్నాడు.

Read Also: CM Chandrababu: ఇంతకంటే మంచి సమయం లేదు.. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

అయితే, గతంలో కెనడాలో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుల్ని తమకు అప్పగించాలని కొన్నేళ్ల క్రితం భారత్ కోరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న సిండికేట్ సభ్యుల్ని తమకు అప్పటించాలని భారత్ కెనడాని కోరిందని.. కెనడా ఇంకా స్పందించలేదని అన్నారు. గుర్జిత్ సింగ్, గుర్జీందర్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్ గిల్, లఖ్‌బీర్ సింగ్ లాండా, గుర్‌ప్రీత్ సింగ్ పేర్లను విదేశాంగమంత్రిత్వ శాఖ కెనడాకు ఇచ్చిందని, వీరిలో బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కూడా ఉన్నారని చెప్పింది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను పంచుకోలేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. భారత వ్యతిరేక, వేర్పాటువాద అంశాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరినప్పుడు కెనడా తన ‘‘వాక్ స్వాతంత్ర్యాన్ని’’ ముందకు తీసుకువస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లారెన్స్ బిష్ణోయ్ పేరుని వెల్లడించిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది.