Sonia Gandhi: ‘ఎక్స్‌’లోకి ఎంట్రీ.. రాజీవ్‌తో తొలి భేటీ వివరాలు పంచుకున్న సోనియాగాంధీ

  • ‘ఎక్స్‌’లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియాగాంధీ
  • రాజీవ్‌తో తొలి భేటీ వివరాలు పంచుకున్న సోనియా
  • ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సోనియా
Soniagandhi

Soniagandhi

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. తొలి పోస్ట్‌గా ‘బిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే పుస్తకంలోని ఒక వీడియోను పంచుకున్నారు. తాజాగా మరో సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లోకి కూడా ప్రవేశించారు. ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో ఏర్పడిన తొలి పరిచయాన్ని సోనియాగాంధీ పంచుకున్నారు. వీడియోలో రాజీవ్ గాంధీతో తొలి భేటీ, తొలిరోజులు, వారి ప్రేమాయణం గురించి వివరించారు. సోనియా గాంధీ రచించిన ‘బిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నవంబర్ 10న విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఎక్స్ వీడియోలో రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్‌లో ఎలా కలుసుకున్నారో సోనియా గాంధీ వివరించారు. మొదటిసారి కలుసుకున్న రెస్టారెంట్ ఫొటోలను కూడా చూపించారు. ‘నా ప్రేమ ప్రయాణం కేంబ్రిడ్జ్‌లోని ఒక చిన్న గ్రీక్ రెస్టారెంట్‌లో మొదలైంది. నేనూ, రాజీవ్‌ ప్రేమ, నవ్వులు, జ్ఞాపకాలతో నిండిన ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాం. నవంబర్ 10న నేను ఆ ప్రపంచాన్ని మీతో పంచుకోబోతున్నాను.’’ అని రాసుకొచ్చారు.

వీడియోలో ఫొటోలను చూపిస్తూ రాజీవ్ గాంధీ చాలా ఆకర్షణీయమైన, సౌమ్యుడైన వ్యక్తిగా అభివర్ణించారు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్‌లో ఆహారం అసలు బాగోలేదన్నారు. ఈ రోజు ఉన్నన్ని రెస్టారెంట్లు అప్పట్లో లేవని చెప్పారు. ఇటాలియన్ ఆహారం కోసం ప్రత్యేకంగా వెతికినట్లు తెలిపారు. తినడానికి మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతున్నప్పుడు తనకు వర్సిటీ రెస్టారెంట్ కనిపించిందని.. అక్కడే తాను, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలుసుకున్నామని చెప్పారు.

తొలి చూపులోనే ప్రేమ

తొలిసారి రాజీవ్ గాంధీని కలిసినప్పుడు తన జీవితాన్ని ఆయనతో గడపాలని వెంటనే అనిపించిందని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీకి కూడా అలాంటి భావనలే ఉండేవని స్పష్టం చేశారు. తామిద్దరం ఒక ఉమ్మడి స్నేహితుడి ద్వారా కలుసుకున్నట్లు చెప్పారు. అనంతరం క్రమంగా స్నేహితులం అయినట్లు పేర్కొన్నారు. పార్టీలకు వెళ్లడం.. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేవారని.. చాలా మంది విద్యార్థులతో కలిసి ఒక వాలెంటైన్స్ డే పార్టీకి కూడా హాజరయ్యారని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ స్వభావరీత్యా చాలా సౌమ్యుడని, ఆయన వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉండేదని అన్నారు. ఈ సరళత, సౌమ్యత తనకు ఎంతో నచ్చే విషయమని తెలిపారు. రాజీవ్ గాంధీతో తన తొలి సమావేశాన్ని తాను ఎప్పటికీ మరచిపోలేనని సోనియాగాంధీ వెల్లడించారు.