కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించిన ఓటర్ లిస్ట్ వ్యవహారంలో ఢిల్లీ ద్వారకా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన రివిజన్ పిటిషన్‌పై తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులను సెప్టెంబర్ 21న వెలువరించనున్నట్లు తెలిపింది.
శనివారం ఈ కేసుపై విచారణ చేపట్టిన ద్వారకా కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోనియా గాంధీ పేరు భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో చేర్చారంటూ వికాస్ త్రిపాఠి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆయన కోరుతున్నారు.
తొలుత పిటిషన్ కొట్టివేత
సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వికాస్ త్రిపాఠి తొలుత మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ త్రిపాఠి సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో గతంలో ప్రత్యేక న్యాయమూర్తిగా ఉన్న విశాల్ గోగ్నే ఆగస్టు 29న తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఆయన బదిలీ కావడంతో తీర్పు ప్రకటన వాయిదా పడింది. అంతకుముందు జూలై 25న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
సోనియా తరఫు న్యాయవాదుల వాదన
సోనియా గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.ఎస్. చీమా, న్యాయవాది తరన్నుమ్ చీమా వాదనలు వినిపించారు. పిటిషనర్ కోర్టు ముందుంచిన పత్రాలు అసలైనవి కావని వారు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోరడం సరైనది కాదని, ఇది ఆధారాలు లేకుండా చేసే ‘ఫిషింగ్ అండ్ రోవింగ్ ఇన్వెస్టిగేషన్’గా మారుతుందని వాదించారు. మరోవైపు పిటిషనర్ వికాస్ త్రిపాఠి తరఫున సీనియర్ న్యాయవాది అజయ్ బర్మన్, న్యాయవాది నీరజ్ వాదనలు వినిపించారు. సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఎలా చేర్చారో ప్రతివాదులు వివరించలేకపోయారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
1983కి ముందే ఓటర్ లిస్టులో పేరు?
ఈ కేసు ప్రధానంగా సోనియా గాంధీ పేరు 1983లో భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణల చుట్టూ తిరుగుతోంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చాలంటే భారత పౌరురాలిగా ఉండాల్సిందేనని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. “ఫోర్జరీ చేసిన పత్రాలు లేదా మోసం ద్వారానే ఇది జరిగి ఉండే అవకాశం ఉంది. దీనిపై దర్యాప్తు అవసరం” అని ఆయన కోర్టులో పేర్కొన్నారు. నకిలీ పత్రాలు, ఫోర్జరీకి సంబంధించిన అంశాలపై దర్యాప్తు కోరుతున్నామని తెలిపారు.
కోర్టు కీలక ప్రశ్నలు
విచారణ సందర్భంగా కోర్టు కూడా పిటిషనర్ తరఫు న్యాయవాదిని పలు ప్రశ్నలు వేసింది. “1983లో భారత పౌరురాలిగా మారకముందే సోనియా గాంధీ ఓటరుగా నమోదయ్యారన్న అంశాన్ని మీరు ఎలా దాటవేయగలరు?” అని సోనియా తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో దాదాపు అర్ధ శతాబ్దం క్రితం జరిగిన వ్యవహారంలో ఎవరిపై దర్యాప్తు చేస్తారని, ఎఫ్‌ఐఆర్ కోసం కోరుతున్న అంశం పరిధిని మరింత విస్తరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. సంబంధిత ఓటర్ల జాబితా పత్రాన్ని ఇటీవలే ఎన్నికల సంఘం నుంచి పొందామని తెలిపారు. ఓటర్ల జాబితా కాపీ కోసం దరఖాస్తు చేయగా, ధ్రువీకరించిన కాపీలు తమకు అందాయని కోర్టుకు వివరించారు.
అదనపు పత్రాల సమర్పణకు అనుమతి
ఈ కేసులో అదనపు పత్రాలను రికార్డుల్లో చేర్చేందుకు అనుమతి కోరుతూ ఇరుపక్షాలు గతంలో దరఖాస్తులు దాఖలు చేశాయి. జూలై 4న అదనపు పత్రాలను రికార్డుల్లోకి తీసుకునేందుకు అనుమతి కోరిన దరఖాస్తుపై సోనియా గాంధీ తన సమాధానాన్ని దాఖలు చేశారు. అంతకుముందు మే 16న వికాస్ త్రిపాఠి మరో పత్రాన్ని రికార్డుల్లో చేర్చేందుకు దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 18న వాదనలు ముగిసిన అనంతరం 1980 నాటి ఎన్నికల సంఘం నివేదికను కోర్టు రికార్డుల్లో చేర్చేందుకు అనుమతి కోరారు.
ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులపై దాఖలైన రివిజన్ పిటిషన్‌ను ద్వారకా కోర్టు పరిశీలిస్తోంది. ఈ కేసులో కోర్టు సెప్టెంబర్ 21న తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

