Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!

  • సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్
  • హార్పర్‌కాలిన్స్‌తో కొత్త ఒప్పందం
  • 2026 నవంబర్ 10న ఆత్మకథ విడుదల
Soniagandhi

Soniagandhi

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి పెంగ్విన్ ఇండియా వైదొలిగింది. వివిధ కారణాల చేత ప్రింటింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. కొత్తగా మరో పబ్లిషర్ ముందుకొచ్చింది. శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాజకీయ మెమోయిర్‌ ‘Belonging: A Journey of Love’ పుస్తకాన్ని ప్రచురించనున్నట్లు ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రకటించింది. 2026 నవంబర్ 10న భారత్‌లో ఈ మెమోయిర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

పెంగ్విన్ ఇండియా నుంచి తప్పుకున్న తర్వాత..

ఇంతకుముందు సోనియా గాంధీ మెమోయిర్‌ను పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా (PRHI) ప్రచురించాల్సి ఉంది. అయితే మాన్యుస్క్రిప్ట్‌లోని కొన్ని భాగాలకు సంబంధించి ప్రచురణ సంస్థ సూచించిన “ఎడిటోరియల్ మార్పులు, తొలగింపులు” విషయంలో రచయితతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. సోనియా గాంధీ ఆ మార్పులను అంగీకరించలేదని, దీంతో పెంగ్విన్ ఇండియా పుస్తక ప్రచురణ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

అయితే ఈ వివరణను పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ఖండించింది. సోనియా గాంధీ సూచించిన మార్పులను అంగీకరించకపోవడం వల్లే పుస్తకాన్ని ప్రచురించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పడం సరికాదని పేర్కొంది. పుస్తకంలోని అంశాలను వాస్తవ నిర్ధారణ చేయడం, పుస్తక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయని భావించిన మార్పులను సూచించడం ప్రచురణ సంస్థ హక్కు, బాధ్యత అని తెలిపింది. చర్చలు జరిగినంతకాలం మెమోయిర్‌ను ప్రచురించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేసింది.

హార్పర్‌కాలిన్స్‌తో కొత్త ఒప్పందం

పెంగ్విన్ ఇండియా తప్పుకున్న నేపథ్యంలో పుస్తకాన్ని ప్రచురించేందుకు పలు భారతీయ ప్రచురణ సంస్థలు ఆసక్తి చూపాయి. చివరకు హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురణ, పంపిణీ బాధ్యతలను చేపట్టేందుకు ముందుకొచ్చింది. “మన కాలంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజకీయ మెమోయిర్‌లలో ఇది ఒకటి. ‘Belonging’ ప్రేమ, గుర్తింపు, బాధ్యత, అనుబంధానికి సంబంధించిన నాటకీయమైన, అత్యంత వ్యక్తిగత కథ. అలాగే భారత్‌ ప్రయాణంపై అరుదైన అంతర్గత దృక్పథాన్ని అందిస్తుంది” అని హార్పర్‌కాలిన్స్ ఇండియా పేర్కొంది.

మోడీ, ఆర్ఎస్ఎస్ అంశాలపై వివాదం?

పెంగ్విన్ ఇండియా కొన్ని కీలక అంశాలను తొలగించాలని ఒత్తిడి తెచ్చిందని మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS), అలాగే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాలకు సంబంధించిన భాగాలను తొలగించాలని ప్రచురణ సంస్థపై ఒత్తిడి వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా భిన్నమైన వివరణ ఇచ్చింది. మాన్యుస్క్రిప్ట్‌ను వాస్తవ నిర్ధారణ చేయడం, అవసరమైన సంపాదకీయ సూచనలు చేయడం ప్రచురణ ప్రక్రియలో భాగమని తెలిపింది.

సోనియా జీవితంలోని కీలక ఘట్టాల ప్రస్తావన

‘Belonging: A Journey of Love’లో సోనియా గాంధీ జీవితంలోని అనేక కీలక మలుపులు, విషాద ఘటనలు ప్రస్తావనకు వస్తాయి. ఆమె భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, అత్త, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యలు ఆమె జీవితంపై చూపిన ప్రభావాన్ని కూడా మెమోయిర్‌లో వివరించినట్లు తెలుస్తోంది. అలాగే సోనియా గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించిన తీరు, కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు, 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి పదవిని స్వీకరించకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం వంటి కీలక అంశాలు కూడా ఇందులో ఉండనున్నాయి.

2026 నవంబర్ 10న ‘Belonging: A Journey of Love’ భారత్‌లో విడుదల కానుండటంతో.. సోనియా గాంధీ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై ఈ మెమోయిర్‌లో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయన్న దానిపై ఆసక్తి నెలకొంది.