Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్‌కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..

  • సోనమ్‌ వాంగ్‌చుక్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట..
  • మెదాంత ఆస్పత్రికి తరలించాలని ఆదేశం..
Sonam

Sonam

Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు ఊరట లభించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు కీల ఆదేశాలు జారీ చేసింది. వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి మెదాంత హాస్పిటల్ తరలించాలని ఆదేశించింది. ఆయన చికిత్స కోసం నిపుణులైన వైద్యులతో ప్రత్యేక ప్యానెల్ ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు ఉన్న అన్ని వైద్య నివేదికల్ని ఆ బృందానికి అందించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం ఈ కేసును విచారించింది. పూర్తి ఉత్తర్వులను మధ్యాహ్నం తర్వాత విడుదల చేస్తామని కోర్టు తెలిపింది.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరుఫున హాజరైన సోలిసిటర్ జనరల్ మాట్లాడుతూ.. వాంగ్‌చుక్‌ను మెదాంతకు తరలించేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, వైద్యుల సలహాకు విరుద్ధంగా అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయకూడదనే షరతును ప్రభుత్వం విధించింది. వాంగ్‌చుక్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అతడిని ఆస్పత్రి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది భద్రతా సమస్యలకు దారి తీయవచ్చని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. వాంగ్‌చుక్ తనకు నచ్చిన ఆసుపత్రిని, వైద్యుడిని ఎంచుకోవచ్చని, అయితే వైద్య సలహాకు విరుద్ధంగా అతడిని డిశ్చార్జ్ చేయకూడదని సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

వైద్య నివేదికలు, నిపుణుల అభిప్రాయాలను పరిశీలించిన హైకోర్టు, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితికి నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది. అవసరమైతే తక్షణ చికిత్స అందేలా ఆస్పత్రిలోనే ఉంచాలని కొందరు వైద్యులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వాదనలు విన్న తర్వాత వాంగ్ చుక్ కోరుతున్న మెదాంత ఆస్పత్రికి ఆయనను బదిలీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.