Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన భర్త రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ దారునంగా హత్య చేయించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోనమ్ తన భర్తని చంపేందుకు కిరాయి హంతకులకు రూ. 4 లక్షల ఆఫర్ చేసిందని, ఆ తర్వాత మొత్తాన్ని రూ. 20 లక్షలకు పెంచినట్లు విచారణలో వెల్లడైంది. భర్త మృతదేహాన్ని లోయలోకి తోసేందుకు సోనమ్ నిందితులకు సహాయం చేసింది.
జూన్ 02న తూర్పు ఖాసీ హిల్స్ లోని సోహ్రా ప్రాంతంల(చిరపుంజి) ప్రాంతంలో ఒక జలపాతానికి సమీపంలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహాలు కలిసి ఈ మర్డర్‌కి ప్లాన్ చేశారు. ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నారు. హంతకుల్లో ఒకరు బెంగళూర్‌లో ఈ జంటను కలిశారు. ఈశాన్య భారతదేశానికి వెళ్లే విమానంలో వీరంతా ప్రయాణించారు. ఒకే నగరానికి చెందిన వ్యక్తులు కావడంతో రాజా రఘువంశీ నిందితులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.
Read Also: Maruti Suzuki Car Offers: మారుతి కార్లపై రూ. 1.33 లక్షల డిస్కౌంట్.. లేట్ చేయకండి
సోనమ్ ప్రియుడు కుష్వాహా మేఘాలయా వెళ్లకున్నా, తెరవెనక మొత్తం మర్డర్ ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. నిందితులు ఈ జంటను మే 21న గౌహతి నుంచి వెంబడిస్తున్నారు. మే 22న షిల్లాంగ్ లో ఈ జంట బస చేసిన హోటల్‌కి సమీపంలోనే వీరు కూడా బస చేశారు. ఆ మరుసటి రోజే రాజాను హత్య చేశారు. మే 23న సోనమ్, రాజా రఘువంశీలు జలపాతాన్ని చూసేందుకు ట్రెక్కింగ్‌కి వెళ్లారు. వీరిని నిందితులు అనుసరించారు.
అలసిపోయాననే సాకుతో సోనమ్ తన భర్త వెనకాల నిందితులకు దగ్గరగా నడిచింది. నిర్జన ప్రదేశంలో తన భర్తను చంపాలని ఆదేశించింది. అయితే, నిందితులు.. తాము అలసిపోయామని, చంపడానికి నిరాకరించారు. ఆ తర్వాత సోనమ్ వారికి ఇస్తానని చెప్పిన రూ. 4 లక్షలను రూ. 20 లక్షలకు పెంచి హత్య చేసేలా ప్రేరేపించింది. రఘువంశీ తలపై ముందు వెనక గాయాలు ఉన్నాయి.
రాజా రఘువంశీ మృతదేహాన్ని లోయలో కనుగొన్న ఒక రోజు తర్వాత, జూన్ 3న మేఘాలయ పోలీసులకు అతని భార్య హత్యలో ప్రమేయం ఉందని తెలిసింది. ఇండోర్‌కు చెందిన రాజ్ కుష్వాహా, విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మితో సహా ఆ వ్యక్తిని చంపడానికి కుట్ర పన్నిన వారందరినీ ‘ఆపరేషన్ హనీమూన్’ అనే కోడ్‌నేమ్‌తో అరెస్టు చేసినట్లు మేఘాలయ పోలీసులు పేర్కొన్నారు. హత్య తర్వాత సోనమ్ తన స్వస్థలం ఇండోర్‌కి బయలుదేరింది. ఉత్తర ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలోని నందగంజ్ పోలీస్ స్టేషన్ ముందు లొంగిపోయింది. ఆ తర్వాత మేఘాలయ పోలీసులు నిందితులందర్ని అరెస్ట్ చేశారు.