NTV Telugu Site icon

Solar Eclipse: నేడు సూర్యగ్రహణం.. 22 ఏళ్ల తర్వాత అరుదైన దృశ్యం.. ఎక్కడ..? ఏ సమయంలో..?

Solar Eclipse

Solar Eclipse

ఖగోళంలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది.. 22 ఏళ్ల తర్వాత ఇవాళ అరుదైన దృశ్యం చూసే అవకాశం దక్కింది.. 2022వ సంవత్సరంలో రెండో సారి మరియు చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి దీపావళి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో గ్రహణం ఏర్పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సారి పాక్షిక సూర్యగ్రహణం ప్రభావం గంటా 45 నిమిషాల పాటు ఉంటుందని పండితులు చెబుతున్నమాట… ఇవాళ ఏర్పడే సూర్యగ్రహణం ఐరోపా, ఈశాన్య ఆఫ్రికా మరియు పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో దర్శనమిస్తుంది.. భారత్‌లో కూడా పలు నగరాల్లో పాక్షిక సూర్యగ్రహణం కనువిందు చేయనుంది.. ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, ఉజ్జయిని, వారణాసి మధుర, హైదరాబాద్‌ సహా మరికొన్ని నగరాల్లో సూర్యగ్రహణం కనిపించబోతోంది..

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుండగా.. కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం విశేషంగా చెబుతున్నారు.. అంటే సహజంగా రాహుకేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో ఏర్పడే దానిని రాహుగ్రస్తమని, కేతుగణ ప్రభావంతో ఏర్పడే దానిని కేతుగ్రస్తమని అంటారు. అయితే, కేతుగ్రస్త సూ ర్యగ్రహణం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. ఇక, భారత్‌లో సూర్యగ్రహణం ప్రభావం ఎలా ఉండబోతోంది? ఎప్పుడు ? ఎక్కడ ? ఏ సమయంలో కనిపిస్తుందనే వివరాల్లోకి వెళ్తే.. భారత్‌లో సూర్యగ్రహణం సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత కూడా ఉంటుందని.. గ్రహణకాలం దాదాపు 1.15 గంటల పాటు కొనసాగుతుందని పండితులు చెబుతున్నమాట.. అయితే, దీనిలో మరింత లోతుగా వెళ్తే.. గ్రహణకాల నిర్ణయంలో మూడు భాగాలు ఉంటాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రహణ శూల ఉంటుందని.. గ్రహణం ప్రారంభ సమయం, పూర్తి గ్రహణ సమయం, విడుపు సమయం మొదలైన వాటిని లెక్కవేసి చెబుతున్నారు.. హైదరాబాదులో సాయంత్రం 4:59 గంటలకు ప్రారంభమై 5:48 నిమిషాలకు ముగియనుంది.. ముంబైలో సాయంత్రం 4:49 గంటలకు ప్రారంభం కానుండగా.. చెన్నైలో సూర్యగ్రహణం సాయంత్రం 5:14 గంటలకు ప్రారంభమవుతుంది.. గ్రహణం యొక్క వ్యవధి ఢిల్లీ మరియు ముంబై రెండింటికీ వరుసగా 1 గంట 13 నిమిషాలు మరియు 1 గంట 19 నిమిషాలు ఉంటుందని చెబుతున్నారు.. .

కాగా, సూర్యునికి మరియు భూమికి మధ్య చంద్రుడు వచ్చి కొంత సమయం వరకు సూర్యకాంతిని భూమికి చేరకుండా అడ్డుకున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది.. దీంతో చంద్రుడి నీడ భూమిపై పడి సూర్యుడిలోని కొంత భాగం కనిపించ కుండా చేస్తుంది… అయితే, సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు. గ్రహణం వీక్షించేందుకు అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్ మరికొన్ని ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. టెలిస్కోప్ ద్వారా సూర్యగ్రహణం చూడవచ్చు.. ఇక గ్రహణం సమయంలో చిన్నపిల్లలను దూరంగా ఉంచండి.. బయటకు పంపకూడదంటూ పండితులు చెబుతున్నారు.. ఇక, ఈ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదని వేదపండితులు చెబుతున్నమాట.. ఈసారి కేతుగ్రస్త సూర్యగ్రహణం స్వాతి నక్షత్రంలో ఏర్పడుతోన్న నేపథ్యంలో.. ఆ నక్షత్రంలో జన్మించిన వారు, గర్భవతులు సూర్యగ్రహణాన్ని చూడకూడదని వివరిస్తున్నారు.. గ్రహణసమయంలో జపం, దానం వంటివి చేస్తే ఎంతో ఫలితాన్ని ఇస్తాయట.. ఇక గ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని, గ్రహణ స్నానం ఆచరించి ఆ తర్వాత భోజనం చేయాలని.. అప్పటివరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు అంటున్నారు..

మరోవైపు.. ఇది ఖగోళ అద్భుతం అందరూ చూడాలని చెబుతున్నాయి జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు.. అయితే, నేరుగా సూర్యుడిని చూడకుండా.. అల్యూమినైజ్డ్ మైలార్, బ్లాక్ పాలిమర్, వెల్డింగ్ గ్లాసెస్.. చివరకు స్కానింగ్‌ ఫిల్మ్స్‌ లాంటివి ఉపయోగించాలని సూచిస్తున్నారు.. గ్రహణ సమయంలో ఏమీ తినొద్దు అనే ప్రచారాన్ని నమ్మొద్దని.. గతంలో గ్రహణ సమయంలోనే వాళ్లు అల్పాహారం ఆరగించిన సందర్భాలు లేకపోలేదు.. చివరకు గర్భిణిలను కూడా తీసుకొచ్చి గ్రహణాన్ని చూపించాయి జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు.. మొత్తంగా.. 22 ఏళ్ల తర్వాత ఏర్పడుతోన్న ఖగోళ అద్భుతాన్ని కొన్ని జాగ్రత్తలతో తీసుకోవాలని చెబుతున్నారు. ఇక, సాధారణంగా గ్రహణ సమయంలో అన్ని ఆల యాలను మూసి వేయటం, గ్రహణం విడిచిన తర్వాత ఆలయ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి తిరిగి తెరవటం ఆనవాయితిగా వస్తున్న విషం తెలిసిందే కాగా… తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు కూడా మూసివేయనున్నారు..

Show comments