NTV Telugu Site icon

Morbi Bridge Collapse: మోర్బీ వంతెన ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు

Morbi Bridge Collapse

Morbi Bridge Collapse

SIT Reveals The Reason Behind Morbi Bridge Collapse: గతేడాది గుజరాత్‌తో మోర్బీ వంతెన కూలిన ఘటన గుర్తుందా? ఈ ప్రమాదంలో మొత్తం 135 మంది మరణించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేపట్టిన విచారణలో.. కూలడానికి ముందే ఈ బ్రిడ్జిలో చాలా లోపాలు ఉన్నాయని తేలింది. కేబుల్‌పై దాదాపు సగం వైర్లు తుప్పుపట్టడం, పాత సస్పెండర్లను కొత్తవాటితో వెల్డింగ్ చేయడం వంటి తప్పిదాలు.. ఈ వంతెన కూలిపోవడానికి దారతీశాయని సిట్ తన నివేదికలో పేర్కొంది. వంతెన మరమ్మత్తులు, నిర్వహణలో అనేక లోపాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ బేనివాల్, ఐపీఎస్ అధికారి సుభాష్ త్రివేది, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ తదితరులు ఈ సిట్‌లో సభ్యులుగా ఉన్నారు.

Ghost Video: నడిరోడ్డుపై దెయ్యం.. చితకబాదిన బైకర్.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్

1887లో మచ్చు నదిపై బ్రిటీష్ వాళ్లు నిర్మించిన ఈ వంతెనలో రెండు ప్రధాన తీగలున్నాయి. గతేడాది అక్టోబర్ 30న ఆ వెంతనే కూలిపోవడానికి ముందే.. ఆ రెండు కేబుల్స్‌లోని ఒక కేబుల్‌ తుప్పు పట్టిపోవడంతో పాటు అందులోని సగానికి పైగా వైర్లు తెగిపోయి ఉండొచ్చని సిట్ గుర్తించింది. నదికి ఎగువన ఉన్న ఆ కేబుల్ తగిపోవడం వల్లే.. ఈ విషాదం చోటు చేసుకుందని సిట్ పేర్కొంది. ప్రతి కేబుల్ ఏడు తంతువులతో రూపొందించబడింది. ఒక్క తంతువులో ఏడు వైర్లు ఉంటాయి. అంటే.. కేబుల్‌ను మొత్తం 49 వైర్లను ఏడు తంతువులుగా కలిపి రూపొందిస్తారని తన నివేదికలో సిట్ వెల్లడించింది. ఆ 49 వైర్లలో 22 తుప్పు పట్టినట్లు గుర్తించామని.. అక్టోబర్ 30న ఆ వెంతెన కూలిపోవడానికి ముందే ఆ వైర్లు విరిగిపోయి ఉండొచ్చని, మిగిలిన 27 వైర్లు సంఘటన సమయంలో బ్రేక్ అయ్యాయని తెలిపింది. అలాగే.. వెంతెన పునరుద్ధరణలో భాగంగా కొత్త సస్పెండర్లను పాత సస్పెండర్‌లతో వెల్డింగ్ చేయబడ్డాయని, దాని వల్ల సస్పెండర్ల ప్రవర్తన మారిందని తెలిపింది. ఈ రకమైన వంతెనలలో.. అధిక భారాన్ని మోయడానికి వీలుగా సింగిల్ రాడ్ సస్పెండర్లు ఉండాలని స్పష్టం చేసింది.

Sandhya Convection MD Arrest: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్.. కారణం ఇదే..

ఇదిలావుండగా.. జనరల్ బోర్డు ఆమోదం లేకుండా మోర్బి మునిసిపాలిటీ వంతెన నిర్వహణ కాంట్రాక్టును ఒరెవా గ్రూప్‌కు అప్పగించింది. ఈ సంస్థ వంతెన పునర్నిర్మాణం కోసం 2022 మార్చి నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు వంతెనని మూసివేసింది. అది కూడా ముందస్తు అనుమతి లేకుండానే! సిట్ నివేదిక ప్రకారం.. కూలిపోయే సమయంలో వంతెనపై దాదాపు 300 మంది వ్యక్తులు ఉన్నారు. ఇది వంతెన భారం మోసే సామర్థ్యం కంటే చాలా ఎక్కువ. చెక్క పలకలకు బదులు అల్యూమినియం డెక్‌‌ని అమర్చడం కూడా.. ఈ వంతెన కూలిపోవడంలో ఒక కారణమని సిట్ పేర్కొంది. ఒకవేళ చెక్క పలకలు ఉండి ఉంటే.. బహుశా మృతుల సంఖ్య తక్కువగా ఉండేదని సిట్ అంచనా వేస్తోంది. అంతేకాదు.. వంతెనను తెరవడానికి ముందు లోడ్ టెస్ట్ కూడా నిర్వహించలేదు. అల్యూమినియం డెక్.. ఈ వంతెన బరువుని మరింత పెంచి ఉండొచ్చని సిట్ తన నివేదికలో తెలిపింది. కాగా.. మోర్బీ పోలీసులు ఇప్పటికే ఒరెవా గ్రూప్ ఎండీ జయసుఖ్ పటేల్ సహా పది మంది నిందితులను IPC సెక్షన్లు 304, 308, 336, 337, 338 కింద అరెస్టు చేశారు.