Site icon NTV Telugu

Singer Zubeen Garg: ఆదివారం అస్సాం రానున్న సింగర్ జుబీన్ గార్గ్ భౌతికకాయం.. శోకసంద్రంలో అభిమానులు

Singer Zubeen Garg

Singer Zubeen Garg

ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం బోటుపై షికారు చేస్తుండగా ప్రమాదానికి గురైంది. లైఫ్ జాకెట్ ధరించకపోవడంతో నీళ్లలో శవమై కనిపించారు. ఆయన మరణ వార్త తెలియగానే అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన్ను తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.. జుబీన్ గార్గ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని మోడీ కూడా జుబీన్ గార్గ్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

ఇక జుబీన్ గార్గ్ భౌతికకాయం ఆదివారం సాయంత్రానికి అస్సాంకు రానున్నట్లు తెలుస్తోంది. భారత హైకమిషనర్‌తో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంతనాలు జరుపుతున్నారు.

జుబీన్ గార్గ్..
జుబీన్ గార్గ్ 1972, నవంబర్ 18న అస్సాంలో జన్మించారు. మూడేళ్ల నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. దాదాపు 40కు పైగా భాషల్లో పాటలు పాడారు. ఎక్కువగా బెంగాల్‌ భాషలో పాడారు. 2006లో వచ్చిన ‘యా అలీ’ అనే హిట్ పాటతో భారతదేశమంతటా జుబీన్ గార్గ్ పేరు మార్మోగిపోయింది. అయితే సింగపూర్ ఫెస్టివల్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. శ్వాస తీసుకోవడం వల్ల చనిపోయారని కొందరు అంటుంటే.. లైఫ్ జాకెట్ ధరించకుండా ఈత కొట్టడం వల్లే గార్గ్ మునిగిపోయారంటూ రకరకాలైన వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన్ను బ్రతికించేందుకు సహచరులు ప్రయత్నించినట్లు సమాచారం. ఐసీయూలో చికిత్స అందించారు. కానీ ప్రాణాలు నిలబడలేదు. శుక్రవారం సాయంత్రం ఆయన చనిపోయినట్లు ప్రకటించారు.

బోటులో మొత్తం 18 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో అస్సామీకి చెందిన 11 మంది, గాయక బృందంలోని నలుగురు సభ్యులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. ఇంకొకరు బోటు బుక్ చేసిన వ్యక్తి ఉన్నాడు. అయితే అందరూ క్షేమంగా ఉన్నారు. కానీ గార్గ్ మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన మరణంపై తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఆదివారం సాయంత్రానికి భౌతికకాయం గౌహతి వస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజల సందర్శనార్థం గౌహతిలోని సారుసజై స్టేడియంలో ఉంచుతామని చెప్పారు. అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయనేది అస్సాం ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. గార్గ్ రాష్ట్ర ప్రజలకు చెందిన వాడు.. వాళ్లే నిర్ణయింంచుకుంటారన్నారు. ప్రజలను సంప్రదించకుండా తామేమీ చేయమని తేల్చిచెప్పారు.

గార్గ్ సాంస్కృతిక చిహ్నం అని.. అస్సాం స్వరం మూగబోయిందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు. ఇక గార్గ్ ప్రతిభ నిజంగా సాటిలేనిది అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. తన సోదరుడిని కోల్పోయానంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. గార్గ్ మరణం శూన్యతను మిగిల్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.

 

Exit mobile version