Aaftab seeks release of debit, credit cards for clothes: ఢిల్లీలో హత్యకు గురైన శ్రద్ధావాకర్ కేసు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. లివ్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతు కోసి హత్య చేసి, శరీరాన్ని 35 ముక్కులగా నరికి ఢిల్లీ శివార్లలో పారేశాడు. మే నెలలో హత్య జరిగితే.. ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అఫ్తాబ్ నేరాన్ని అంగీకరించాడు. అతనికి జరిగిన పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల్లో శ్రద్ధాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
శుక్రవారం రోజు ఢిల్లీ కోర్టు అఫ్తాబ్ జ్యుడీషియల్ కస్టడీని మరో నాలుగు రోజులు పొడగించింది. కేసు విచారణ కొనసాగుతుండగా..తన క్రెడిట్, డెబిట్ కార్డులను విడుదల చేయాలని, చలికాలంలో దస్తులు కొనుక్కోవడానికి డబ్బులు లేవని కోర్టుకు తెలియజేశాడు. అఫ్తాబ్ న్యాయవాది ఎంఎస్ ఖాన్, న్యాయమూర్తి అవిరల్ శుక్లా ముందు పిటిషన్ దాఖల చేశాడు. నిందితుడు అఫ్తాబ్ తీహార్ జైలులో కఠినమైన చలిని ఎదుర్కొంటున్నాడని, చలికాలం కోసం బట్టలు కొనేందుకు డబ్బులు విడుదల చేయాలని అతని తరుపు లాయర్ కోరాడు. జనవరి 10న తదుపరి విచారణ జరగనుంది. శ్రద్ధా హత్య కేసులో అఫ్తాబ్ నవంబర్ 9 నుంచి కస్టడీలో ఉన్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలు, వెంట్రుకలు శ్రద్దావే అని డీఎన్ఏ పరీక్షలో తేలింది. శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో సరిపోలాయి.
