shivsena’s Thackeray Camp on bilkis bano case: బిల్కిస్ బానో అత్యాచార నిందుతులను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రిపై విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఈ విడుదల ద్వారా దేశ మహిళలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేతలకు, మాటలకు తేడా ఉంటుందని ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వ స్పందనను తెలియజేయాలని ఆదేశించింది.
Read Also: Asia Cup: పాకిస్తాన్ – ఇండియా మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్
ఇదిలా ఉంటే ఈ కేసుపై శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం స్పందించింది. తన అధికార పత్రిక సామ్నాలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించింది. బిల్కిస్ బానో అత్యాచార నిందితులను విడుదల చేయడంపై మోదీ, అమిత్ షాలు మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. రేపిస్టులను సత్కరించడం ‘‘హిందూ సంస్కృతా’’ అని ప్రశ్నించింది. సామ్నా పత్రికలో ‘ కడక్ నాథ్ ముంబైకర్’ బైలైన్ తో ప్రచురితమైన ఓ ఆర్టికల్ లో బీజేపీ తీరును ఎండగట్టింది. బిల్కిస్ బానో ముస్లిం అయినందు వల్ల ఆమెపై జరిగిన నేరాన్ని క్షమించలేవని.. ఇది హిందూ-ముస్లిం సమస్య కాదని.. హిందుత్వ ఆత్మ, గొప్ప సంస్కృతికి సంబంధించిందని సామ్నాలో పేర్కొంది. ప్రధాని గుజరాల్ పర్యటనలో బిల్కిస్ బానో కుటుంబాన్ని సందర్శించి ఆమెకు మద్దతు అందించాలని డిమాండ్ చేసింది.
2002లో గోద్రా రైలు దగ్ధం జరిగిన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె కుటుంబంలో మూడేళ్ల కుమార్తెతో పాటు ఏడుగురిని చంపారు. ఈ ఘటన తర్వాత సీబీఐ స్పెషల్ కోర్టు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. ఇదిలా ఉంటే ఇటీవల గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ద్వారా ఈ 11 మందిని ఆగస్టు 15న జైలు నుంచి విడుదల చేసింది. వీరంతా 15 ఏళ్ల జైలు శిక్షను పూర్తి చేసుకున్నారు. వీరు విడుదలైన తర్వాత స్థానిక నాయకులు స్వీట్లు, పూల దండలతో సత్కరించడం వివాదాస్పదం అయింది.
