Site icon NTV Telugu

Shinzo Abe: షింజో అబే హత్యకు అగ్నిపథ్ పథకానికి ముడిపెడుతూ కథనం

Shinzo Abe And Agnipath

Shinzo Abe And Agnipath

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్‌ స్కీంకు ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కథనాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ వెలువరించింది. షింజో అబే హత్య ఘటన అగ్నిపథ్‌పై వ్యతిరేకతను బలపరుస్తుందని ఈ బెంగాలీ కథనం పేర్కొంది. ఎందుకంటే.. షింజో అబేను హతమార్చిన టెత్సుయా యమగామి జపాన్‌ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్‌ రాకుండా ఇబ్బంది పడ్డాడని చెప్పుకొచ్చింది. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్ చర్చకు దారితీసింది. ‘భారత్‌ కూడా తాజాగా రక్షణ బలగాల్లో ఇదే తరహా నియామకాలు చేపడుతోంది. దీనికింద అభ్యర్థులు కేవలం నాలుగున్నరేళ్లు మాత్రమే విధుల్లో ఉంటారు. ఆ తర్వాత పెన్షన్ ఉండదు. పదవీ విరమణ అనంతరం ఇతర ప్రయోజనాలు దక్కవు’ అని ‘జాగో బంగ్లా’ పత్రిక ప్రచురించిన కథనంలో పొందుపర్చింది.

Shinzo Abe: భద్రతా వైఫల్యం వల్లే షింజో అబే హత్య..

మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్‌, ఇతర రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్‌ నేత సురేంద్ర రాజ్‌పుత్‌ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్‌ చేశాడు. కాంగ్రెస్‌ నేత ట్వీట్‌తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారంలో ఉన్న షింజో అబే శుక్రవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగుడు వెనక నుంచి కాల్పులు జరపడంతో ఆయన కుప్పకూలారు.

Exit mobile version