CJP Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సంచలనం జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వేదికపైనే ఒక పోలీస్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాఖండ్ పోలీస్ కానిస్టేబుల్ షేర్ సింగ్, వేదికపై ప్రభుత్వాన్ని, వ్యవస్థను ప్రశ్నిస్తూ తీవ్రమైన విమర్శలు చేశారు. నిరసనలో పాల్గొనేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసంగం తర్వాత తన భుజంపై ఉన్న ఉత్తరాఖండ్ పోలీస్ బ్యాడ్జ్‌ను తీసి సీజేపీ అధినేత అభిజిత్ దీప్కేకు అందించారు. దీంతో అక్కడ ఉన్న నిరసనకారులు ఒక్కసారిగా అతడికి మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు.
షేర్ సింగ్ తన ప్రసంగంతో భగత్ సింగ్ చెప్పిన ‘‘జీవితం మన సొంత బలంపై ఆధారపడి ఉంటుంది. విప్లవం ఆలోచన నుంచి పుడుతుంది. మన హక్కుల కోసం పోరాడటమే తిరుగుబాటు అయితే, మేము తిరుగుబాటుదారులమే’’ అని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ నియామక వ్యవస్థల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, ఆయనపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నట్లు ఉత్తరాఖండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఒక నిందితుడి నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణలపై శాఖపరమైన విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. షేర్ సింగ్ గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద బ్యాడ్జ్ తొలగించడం, బహిరంగ వ్యాఖ్యలు చేయడంపై పూర్తి నివేదికను పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో షేర్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం

