Sheikh Hasina: నన్ను చంపినా.. అరెస్ట్ చేసినా బంగ్లాదేశ్‌కు వెళ్తా.. షేక్ హసీనా కీలక ప్రకటన

  • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కీలక ప్రకటన
  • నన్ను చంపొచ్చు.. అరెస్ట్ చేయొచ్చు
  • బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న షేక్ హసీనా
Sheikh Hasina

Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరిగి తన స్వదేశానికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రకటించారు. 2024లో జరిగిన అల్లర్ల తర్వాత భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. తాజాగా షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ కావొచ్చని, జైలుకు వెళ్లాల్సి రావొచ్చని, ప్రాణాలకు కూడా ముప్పు ఉండొచ్చని తెలిసినా ఈ ఏడాది డిసెంబర్ నాటికి స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రజల నుంచి వస్తున్న పిలుపు కారణంగానే తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఏఎఫ్‌పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 78 ఏళ్ల షేక్ హసీనా మాట్లాడుతూ.. ‘‘నన్ను చంపేయవచ్చు. నన్ను అరెస్ట్ చేయవచ్చు. జైలుకు కూడా పంపవచ్చు. నా భవితవ్యం ఏమిటో నాకు పూర్తిగా తెలుసు. అయినప్పటికీ నా ప్రజలు నన్ను తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అందుకే నేను నా దేశానికి వెళ్లాలనుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు. తనను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు అప్పగించాలంటూ జరుగుతున్న చర్చలకు, స్వదేశానికి తిరిగి వెళ్లాలన్న నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని హసీనా స్పష్టం చేశారు.

షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా భారత్‌ను కోరింది. ఈ అభ్యర్థన పరిశీలనలో ఉందని భారత్ గతంలో వెల్లడించింది. అయితే తన భవిష్యత్తు ప్రణాళికలపై అప్పగింత అంశం ఎలాంటి ప్రభావం చూపలేదని హసీనా తెలిపారు. భారత్‌లో తనకు తగిన గౌరవం, మర్యాద లభిస్తున్నాయని.. బంగ్లాదేశ్‌కు అప్పగించే అంశంపై భారత అధికారులు తనతో ఎలాంటి చర్చలు జరపలేదని.. తానే దేశానికి తిరిగి వెళ్లాలని స్వయంగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

2024లో హసీనా ప్రభుత్వం పతనమైన తర్వాత బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వ హయాంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఫిబ్రవరిలో తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడినట్లు తెలుస్తోంది. తన 15 ఏళ్ల పాలనలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలను షేక్ హసీనా తిరస్కరించారు. తమ ప్రభుత్వంపై వచ్చిన అనేక ఆరోపణలు రాజకీయ ఉద్దేశాలతో చేసినవేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను అణచివేయడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం, విమర్శకులపై ప్రభుత్వ సంస్థలను ఉపయోగించడం వంటి ఆరోపణలను మానవ హక్కుల సంస్థలు గతంలో హసీనా ప్రభుత్వంపై చేశాయి. ఈ ఆరోపణలపై స్పందించిన హసీనా.. ‘‘ఎప్పుడైనా ఆరోపణలు వచ్చినప్పుడు విచారణలు చేపట్టాం. నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం జరిగేలా చూశాం.’’ అని తెలిపారు.

2024లో విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల సమయంలో అధిక బలప్రయోగానికి తాను అనుమతి ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలను కూడా ఆమె ఖండించారు. ‘‘విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగా ముగిసేలా మా ప్రభుత్వం అత్యంత ఓపికతో వ్యవహరించింది. సమస్యకు శాంతియుత పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాం.’’ అని చెప్పారు. అయితే ఆ ఉద్యమం తర్వాత కేవలం విద్యార్థుల నిరసనగా మాత్రమే మిగలలేదని ఆరోపించారు. ‘‘రహస్య ఆదేశాలు, ప్రణాళికాబద్ధమైన హింస, ప్రచారం, ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో ఆ ఉద్యమం ముందుకు సాగింది.’’ అని వ్యాఖ్యానించారు.

భారత్‌లో ఇటీవల జరిగిన యువత ఆధ్వర్యంలోని నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిన పరిణామాలపై స్పందించేందుకు హసీనా నిరాకరించారు. బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిన తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటారా అనే ప్రశ్నకు కూడా ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె అవామీ లీగ్ పార్టీపై బంగ్లాదేశ్‌లో సమర్థవంతంగా నిషేధం కొనసాగుతోంది. అయితే ‘‘అధికారం నా లక్ష్యం కాదు. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం.’’ అని హసీనా పేర్కొన్నారు.

2024లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణచివేసే ప్రయత్నాల్లో సుమారు 1,400 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. గత నవంబర్‌లో ఢాకాలోని ఒక కోర్టు షేక్ హసీనాను మానవత్వానికి వ్యతిరేక నేరాలకు దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును హసీనా తీవ్రంగా ఖండించారు. ఇది చట్టం ముసుగులో జరుగుతున్న రాజకీయ ప్రతీకార చర్య అని ఆరోపించారు. నిరసనల సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి ప్రశ్నించగా.. తమ ఆప్తులను కోల్పోయిన ప్రతి కుటుంబం పట్ల తనకు సానుభూతి ఉందని చెప్పారు. అయితే జరిగిన ఘటనలకు క్షమాపణ చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ఆ సంక్షోభ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై తనకు పశ్చాత్తాపం ఉందా అనే ప్రశ్నకు కూడా హసీనా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ‘‘రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలను ఒక్క వ్యక్తి మాత్రమే తీసుకోడు. మొత్తం సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఒకే సంఘటనను విడిగా చూసి నిర్ణయాలను నిష్పాక్షికంగా అంచనా వేయలేం.’’ అని షేక్ హసీనా పేర్కొన్నారు.