NTV Telugu Site icon

Hyderabad Liberation Day: సెప్టెంబర్ 17న ‘‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’.. అమిత్ షా ప్రకటన..

Amit Shah

Amit Shah

Hyderabad Liberation Day: ప్రతీ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీని ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’’గా జరుపుకోవాలని కేంద్రం ప్రకటించింది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదారాబాద్ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగి ఇండియన్ యూనియన్‌లో చేరిందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 17, 1948న ‘ఆపరేషన్ పోలో’ అనే పోలీసు చర్య తర్వాత ఈ ప్రాంతం నిజాం పాలన నుండి విముక్తి పొందింది.

Read Also: Mumtaj: ఒకప్పుడు తన అందంతో కుర్రకారును ఊపేసిన హాట్ బ్యూటీయేనా.. ఇలా మారింది.. ?

సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపాలని ఈ ప్రాంతం నుంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్ విముక్తిలో అమరవీరులను స్మరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని జరపాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరులయిన వారికి గౌరవసూచకంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినందున ఇది చారిత్రాత్మకమైన రోజు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుంచి విముక్తి చేయడం ద్వారా భారత దేశంలో భాగంగా ఉండటానికి అత్యున్నత త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులకు ఈ నిర్ణయం సముచిత నివాళి అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నాని, ఇది యువతలో దేశభక్తిని పెంపొందిస్తుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పలు జిల్లాలు నిజాం సంస్థానం ఆధీనం ఉండేవి. అప్పటి ప్రజలు రజాకార్ల అరాచకాలతో విసిగిపోయారు. నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. ఇదిలా ఉంటే మరోవైపు కాసింరిజ్వీ నేతృత్వంలోని రజాకార్లు మాత్రం హైదరాబాద్‌ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని భావించారు. ఇది తెలిసిన భారత ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య ప్రారంభించింది. సెప్టెంబరు 17, 1948న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సైనిక చర్యతో నిజాంల పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైంది.