Omar Abdullah: నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘IC814: కాందహార్ హైజాక్’ సంచలనంగా మారింది. ఇందులో ఉగ్రవాదులను హిందూ పేర్లతో పిలవడంపై రచ్చ మొదలైంది. అయితే, కేంద్రం వార్నింగ్‌తో మరోసారి ఇలాంటి ఘటన జరగదని నెట్‌ఫ్లిక్స్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా కూడా వేడిని పెంచుతోంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా IC814 ఫ్లైట్ హైజాక్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా రెండు సందర్భాల్లో తీవ్ర ఒత్తిడితో నిర్ణయాలు తీసుకున్నారని ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఒకటి మాజీ హో మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తు రుబయ్యా సయీద్ కిడ్నాప్ సంఘటన ఒకటైతే, మరొకటి IC814 హైజాక్ సంఘటన అని చెప్పారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా సీఎంగా ఉన్న సమయంలో IC814 హైజాక్ కారణంగా ఖైదీలను విడుదల చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
Read Also: Kolkata Doctor Murder Case: “నన్ను ఇరికించారు”.. పాలిగ్రాఫ్ పరీక్షలో నిందితుడు సంచలన విషయాలు
1989లో కాశ్మీరీ వేర్పాటువాదులు కిడ్నాప్‌కి గురైన మాజీ హోం మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా సయీద్‌ని విడిపించడానికి, అప్పటి వీపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌కి చెందిన ఐదుగురు ఉగ్రవాదుల్ని జైలు నుంచి విడుదల చేశారు. రుబయ్యాని సురక్షితంగా రక్షించేందుకు కేంద్రం ఉగ్రవాదుల్ని విడుదల చేసింది.
‘‘ మా నాన్నని ప్రజలు ఒత్తిడి చేయడం రెండుసార్లు జరిగింది. రుబయ్యా సయీద్ విడుదల చేసిన సంగతిని గుర్తు చేస్తూ హైజాక్‌లో చిక్కుకున్న ప్రయాణికులు కుటుంబాల కోసం ఉగ్రవాదుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఉగ్రవాదుల కోసం ఒక హోం మంత్రి కుమార్తెని విడుదల చేస్తే, మా కుటుంబాల కోసం ఎందుకు విడుదల చేయరు..? ఆమె దేశానికి ఎందుకు విలువైంది..? అలాగే మా కుటుంబాలు కూడా మాకు విలువని కావా..?’’ అని ప్రశ్నించినట్లు ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. 1999లో ఖాట్మాండు నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC814 విమానాన్ని హర్కత్ ఉల్ ముజాహిదీన్‌కి చెందిన ఐదుగురు టెర్రరిస్టులు హైజాక్ చేశారు. విమానాన్ని అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ మీదుగా ఆప్ఘనిస్తాన్ కంట్రోల్‌లోని కాందహార్ తరలించారు. ప్రయాణికుల్ని రక్షించేందుకు జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది.