నారద కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మమతా బెనర్జీ నుంచి రికార్డ్ అఫిడవిట్ తీసుకునేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ మమతా బెనర్జీ, బెంగాల్ ప్రభుత్వం, న్యాయశాఖ మంత్రి హైకోర్టులో తాజా అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. దీనికి ముందు, నారద స్కామ్‌లో తమ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి కోల్‌కతా హైకోర్టు నిరాకరించడాన్ని మమతా బెనర్జీ, న్యాయశాఖ మంత్రి మొలాయ్ ఘటక్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడికి అవకాశం ఉన్నందున నారద కేసు విచారణను బెంగాల్‌లో కాకుండా వేరే చోటకు షిప్ట్ చేయాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. దీనిపై సీఎం, న్యాయశాఖ మంత్రి తమ వాదన వినిపించేందుకు అఫిడవిట్లు సమర్పిస్తామని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, అఫిడవిట్లు సమర్పించకుంటే వచ్చే చిక్కులు సకాలంలో గుర్తించకుండా, ఇప్పుడు తమ ఇష్టానుసారం అవిఢవిట్లు సమర్పిస్తామంటే అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని మమత, ఘటక్‌లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపైనే సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది.
నారద కుంభకోణం.. దీదీకి ఊరట

Mamata Banerjee