Saurav Das LOC Case: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌ను విమానాశ్రయంలో అడ్డుకున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు కీలక సమాచారం వెల్లడించింది. ముంబై పోలీసుల జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ (LOC) కారణంగానే ఆయన విదేశీ ప్రయాణాన్ని నిలిపివేసినట్లు కేంద్రం తెలిపింది. బ్రిటన్‌లో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సౌరవ్ దాస్ యూకే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, విమానాశ్రయంలో అధికారులు ఆయనను ప్రయాణించకుండా అడ్డుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
సౌరవ్ దాస్‌పై LOC జారీ
గురువారం ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించింది. న్యాయమూర్తి అమిత్ మహాజన్ ధర్మాసనం ముందు అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) చేతన్ శర్మ మాట్లాడుతూ.. నవంబర్ 22-23 మధ్య రాత్రి మహారాష్ట్ర పోలీసులు సౌరవ్ దాస్‌పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ LOC అమలులో ఉన్నందునే ఆయనను విమానాశ్రయంలో నిలిపివేసినట్లు కేంద్రం కోర్టుకు వివరించింది. ఈ సర్క్యులర్‌ను సవాల్ చేయాలంటే దాస్ సంబంధిత అధికార పరిధి కలిగిన ఫోరమ్‌ను ఆశ్రయించాలని కేంద్రం పేర్కొంది.
LOC కాపీ ఇవ్వలేమన్న కేంద్రం
సౌరవ్ దాస్ తరఫున సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. తనపై LOC జారీ చేసిన విషయాన్ని అధికారులు ముందుగా తెలియజేయలేదని, దాని ఉద్దేశం కూడా వివరించలేదని ఆయన తెలిపారు. LOC కాపీని అందించాలని న్యాయవాది కోరారు. దాని ఆధారంగా సర్క్యులర్‌ను చట్టపరంగా సవాల్ చేయవచ్చని వాదించారు. అయితే, LOC కాపీని అందజేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు
యూకే వెళ్లకుండా అడ్డుకున్న అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సౌరవ్ దాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం తన సమాధానాన్ని దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణలో కేంద్రం సమర్పించే సమాధానం కీలకంగా మారనుంది.
లుకౌట్ సర్క్యులర్ (LOC) అంటే ఏమిటి?
లుకౌట్ సర్క్యులర్ (Lookout Circular – LOC) అనేది బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా అమలు చేసే ఒక హెచ్చరిక వ్యవస్థ. దేశంలోని విమానాశ్రయాలు, ఇతర అంతర్జాతీయ ప్రవేశ, నిష్క్రమణ కేంద్రాల్లో ఈ అలర్ట్ ఆధారంగా సంబంధిత వ్యక్తుల ప్రయాణ వివరాలను తనిఖీ చేస్తారు.
దర్యాప్తు లేదా చట్టపరమైన కేసులకు సంబంధించి అవసరమైన వ్యక్తులు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు కొన్ని పరిస్థితుల్లో LOC జారీ చేస్తారు. LOC జారీ అయిన ప్రతి వ్యక్తి నేరస్థుడని అర్థం కాదు. సంబంధిత వ్యక్తిపై ఉన్న కేసు, సర్క్యులర్‌లో పేర్కొన్న ఆదేశాలు, అధికారుల నిర్ణయాల ఆధారంగా ప్రయాణానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తారు. సౌరవ్ దాస్‌పై జారీ చేసిన LOC, ఆయన విదేశీ ప్రయాణంపై విధించిన ఆంక్షలు, ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు తదుపరి తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

