గూఢచర్యం ఆరోపణలతో పాక్‌లో మరణించిన సరబ్‌జిత్ సంగ్ సోదరి దల్బీర్ కౌర్ గుండెపోటుతో మృతి చెందారు. తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటి వచ్చాడని, తనను విడుదల చేయాలంటూ ఆమె దాదాపు 22 ఏళ్ల పాటు అలుపెరగని న్యాయపోరాటం చేశారు. పంజాబ్ అమృత్‌సర్‌లోని భిఖివిండ్ గ్రామంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దల్బీర్ కౌర్ అంతిమ సంస్కారాలు గ్రామంలోని నిర్వహిస్తామని కుటుంబసభ్యులు వెల్లడించారు.
తన సోదరుడు పొరపాటున సరిహద్దు దాటి వచ్చారని.. ఆయనను విడుదల చేయాలంటూ ఆమె 22 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. సరబ్‌జిత్‌ను చూసేందుకు పాకిస్థాన్ కూడా వెళ్లివచ్చారు. సరబ్‌జిత్ సింగ్, దల్బీర్‌కౌర్ జీవితాల ఆధారంగా బయోపిక్ సైతం విడుదల అయ్యింది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ దల్బీర్ పాత్రలో నటించిన ‘సరబ్‌జిత్’ చిత్రం 2016లో విడుదలైంది. సరబ్‌జిత్ సింగ్ భారత్, పాకిస్థాన్ సరిహద్దులోని భిఖివిండ్ గ్రామానికి చెందిన రైతు. 1991లో పొరపాటుగా సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. దీంతో గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ చేసిన పాకిస్థాన్ ఆయనకు మరణశిక్షను విధించింది. అనంతరం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. 2013లో తోటి ఖైదీలు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన సరబ్‌జిత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.
అప్పుడు సరబ్‌జిత్ సింగ్ మరణంపై దర్యాప్తు జరపాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. అతని సోదరి దల్బీర్ కౌర్ కూడా ఈ కేసుపై విచారణకు డిమాండ్ చేసింది. “దాడిని ప్రభుత్వమే ప్లాన్ చేసి ఉంటే, అప్పుడు విచారణ అవసరం లేదు. అయితే అధికారులకు తెలియకుండా సరబ్‌జిత్‌పై దాడి జరిగితే, కచ్చితంగా విచారణ అవసరం.” అంటూ ఆమె తన సోదరుడి హత్య గురించి మాట్లాడారు.
