Pinarayi Vijayan: కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎంగా వివాదం ముదురుతోంది. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ టార్గెట్‌గా సీఎం పినరయి విజయన్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ‘‘సంఘ్ పరివార్ ప్రతినిధి’’ అంటూ అభివర్ణించారు. యూనివర్సిటీ సెనెట్‌కి నామినీలను ఎన్నుకునే విషయంలో గవర్నర్ ఆరిఫ్ ఖాన్ కేరళ విశ్వవిద్యాలయ సిఫారసులను తిరస్కరించిన తర్వాత విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కేంద్రం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆరోపించారు. యూనివర్సిటీల్లో నియమించిన నామినీల్లో ‘రైట్ వింగ్’ సభ్యులు ఎక్కువగా ఉన్నారని, సీపీఎం స్టూడెంట్ వింగ్ ఎస్ఎఫ్ఐ ఆరోపిస్తూ ర్యాలీ చేసింది.
Read Also: Khalistan: ఖలిస్తాన్ ఉగ్రవాది హత్యకు కుట్ర.. వచ్చే వారం భారత్ రానున్న ఎఫ్‌బీఐ చీఫ్..
గవర్నర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని సీఎం ఆరోపించారు. గవర్నర్ ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగా తనతో చెప్పాలని, మీడియాతో కాదని అన్నారు. దీనికి ముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన రెండు ఆర్డినెన్సులపై సంతకం గురించి మీడియా ముందు గవర్నర్ ఆరిఫ్ మాట్లాడారు. ఏదైనా బిల్లు, ఆర్డినెన్స్‌కు సంబంధించి అత్యవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్‌ని సంప్రదించి వివరణ ఇవ్వాలని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని ‘ఆజాద్ కాశ్మీర్’గా సంబోధించడం మానుకోవాలని, విభజన వాదానికి ఆజ్యం పోయవద్దని గవర్నర్ కోరారు.