RSS: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) రిజర్వేషన్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ సంస్థ అధ్యక్షుడు మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సంఘ్ పరివార్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు. ఒక విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు అవసరమైనంత కాలం వాటిని పొడగించాలని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలని ఆర్ఎస్ఎస్ చీప్ గతేడాది నాగ్‌పూర్‌లో చెప్పారు. సమాజంలో వివక్ష కనిపించకపోయినా, వివక్ష ఉందని ఆయన అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలో వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, రిజర్వేషన్లను తీసేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, దీనికి ధీటుగా బీజేపీ బదులిస్తూ.. రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్లీ తిరిగి వచ్చినా కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని ప్రధాని మోడీ ఇటీవల అన్నారు. మరోవైపు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింకోటా ఇవ్వడం వివాదాస్పదమైంది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు రాజ్యాంగం వ్యతిరేకమని చెప్పింది.