Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని సంభాల్ నగరం తీవ్రమైన హింసతో అట్టుడికింది. స్థానిక షాహీ జామా మసీదు సర్వేకు వెళ్లిన వారిపై వేల సంఖ్యలో గుంపు రాళ్లదాడికి పాల్పడింది. పోలీసులు, ఇతర అధికారులపై ఆదివారం రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ఫైర్ చేయాల్సివచ్చింది. ఈ హింసలో నలుగురు వ్యక్తులు మరణించగా, పదుల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. వాహనాలు, స్థానికులు ఇళ్లను గుంపు ధ్వంసం చేసింది. సంభాల్‌లోని జామా మసీదు ఒకప్పటి హరిహర్ ఆలయమని హిందూ పక్షం కేసు ఫైల్ చేయడంతో, కోర్టు మసీదు సర్వేకి ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Maharashtra CM: కొనసాగుతున్న ‘‘మహా’’ సస్పెన్స్.. సీఎం పదవిపై ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే రాళ్లదాడి చేసిన వారి పోస్టర్లను ప్రదర్శించేందుకు యూపీ సర్కార్ సిద్ధమైనట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. ‘‘సంభాల్ హింసాకాండలో పాల్గొన్న వ్యక్తులకు వ్యతిరేకంగా UP ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంబిస్తోంది. రాళ్లదాడికి పాల్పడిన సంఘవిద్రోహ శక్తుల పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శిస్తాము. నష్టపరిహారాన్ని రికవరీ చేస్తాము. వారి అరెస్టు కోసం సహకరించిన వారికి రివార్డు కూడా ఇస్తాము’’ అని యూపీ అదికార ప్రతినిధి వెల్లడించారు.
యూపీ సర్కార్ 2020లో సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొని విధ్వంసాన్ని సృష్టించిన వ్యక్తుల పోస్టర్లను కూడా ఇలాగే ప్రదర్శించారు. అయితే, కోర్టు ఆదేశాలతో వీటిని తర్వాత తొలగించారు. సంభాల్ హింసలో ఇప్పటి వరకు 25 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. 7 ఏఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. సమాజ్‌వాదీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్, స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహ్మద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్‌తో సహా 2750 మంది గుర్తుతెలియని అనుమానితులపై కేసులు నమోదయ్యాయి.