NTV Telugu Site icon

Samajwadi Party: బాబ్రీ మసీదుపై వివాదం.. ప్రతిపక్ష కూటమి నుంచి సమాజ్‌వాదీ పార్టీ బయటకు..

Mahaeadhtra

Mahaeadhtra

Samajwadi Party: బాబ్రీ మసీదు కూల్చివేత‌పై ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో విభేదాలకు కారణమైంది. ఈ వ్యాఖ్యల కారణంగా కూటమిలోని ‘‘సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)’’ ఎంవీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. బాబ్రీ మసీదును కూల్చివేత 32వ వార్షికోత్సవం సందర్భంగా శివసేన(ఠాక్రే) నేత మిలింద్ నార్వేకర్ మసీదు ఫోటోని పోస్ట్ చేశారు. శివసేన పితామహుడు బాలాసాహెబ్ ఠాక్రే ఫోటోని పోస్ట్ చేసి ‘‘ ఇది చేసిన వారిని చూసి నేను గర్వపడుతున్నాను’’ అని ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే చిత్రాలను పోస్ట్ చేశారు.

ఈ పరిణామం ఎంవీఏలో చీలికలకు కారణమైంది. మహారాష్ట్రలో సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, ఎన్సీపీ శరద్ పవార్‌ల పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయొద్దని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిని ధిక్కరించి ఎస్పీ ఎమ్మెల్యేలు అబూ అసిమ్ అజ్మీ, రైస్ షేక్ ఇద్దరు ప్రమాణస్వీకారం చేశారు.

Read Also: Narayana Murthy: కింగ్‌ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?

‘‘బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని అభినందిస్తూ శివసేన (UBT) ఒక వార్తాపత్రికలో ఒక ప్రకటన ఇచ్చింది. అతని (ఉద్ధవ్ థాకరే) సహాయకుడు కూడా మసీదు కూల్చివేతను అభినందిస్తూ X లో పోస్ట్ చేశాడు’’ అని మహారాష్ట్ర ఎస్పీ చీఫ్ అజ్మీ చెప్పాడు. తాము ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కి కూడా చెప్పామని, కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కాంగ్రెస్ కూటమిలో ఎవరైనా ఇలాంటి భాష మాట్లాడితే, వారికి బీజేపీకి మధ్య తేడా ఏంటి..? వారితో మేము ఎందుకు ఉండాలి..? అని ఎస్పీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి కేవలం 49 సీట్లకు మాత్రమే పరిమతమైంది. కాంగ్రెస్-16, ఉద్ధవ్ సేన -20, ఎన్సీపీ శరద్ పవార్-10 సీట్లు ఇతర పార్టీలు మరో 3 సీట్లను మాత్రమే సాధించాయి. అయితే, ఈవీఎంలో మోసాల వల్లే బీజేపీ కూటమి గెలిచిందంటూ కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది. ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించారు. ఇది మహారాష్ట్ర ప్రజల ఆదేశం కాదని, ఈవీఎంలు, ఎన్నికల సంఘం ఆదేశం అని ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు.

Show comments