Sambhal Violence: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ నగరంలో అట్టుడుకుతోంది. షాహీ జామా మసీదు వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. కోర్టు ఆదేశాలతో ఈ మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులు, పోలీసులపై అక్కడి స్థానికులు రాళ్ల దాడి చేశారు. పోలీసులు టియర్ గ్యాస్, కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ హింసాత్మక ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించగా, 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి.
అయితే, ఈ హింసాత్మక ఘటనల్లో స్థానిక సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ పాత్ర ఉన్నట్లుగా ఎఫ్ఐఆర్ నమోదైంది. చారిత్రక హరిహర్ ఆలయాన్ని మొఘల్ పాలకుడు బాబర్ కూల్చివేసి ఈ మసీదును నిర్మించారని, హిందూ పక్షం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ సర్వేకి కోర్టు ఆదేశమిచ్చింది. సర్వే చేస్తున్న క్రమంలో ఆదివారం రోజు పెద్ద ఎత్తున స్థానిక గుంపు మూడు వైపుల నుంచి అధికారులపై రాళ్ల దాడికి పాల్పడింది. ఈ మొత్తం కుట్రలో ఎంపీ రెహ్మాన్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహమూద్ కుమారుడు సోహైల్ ఇక్బాల్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో 700-800 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
Read Also: Minister Seethakka : మహిళలను లక్షాధికారులు చేసేందుకు ప్లాన్.. 19 రకాల వ్యాపారాల గుర్తింపు
హింస జరగడానికి రెండు గంటల ముందు రెహ్మాన్ నమాజ్ కోసం మసీదుకు వెళ్లి రెచ్చగొట్టే ప్రకటనలు చేశాడని ఎఫ్ఐఆర్ పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం జనాలను రెచ్చగొట్టి మత సామరస్యాన్ని దెబ్బ తీసినట్లు కేసు నమోదైంది. సంఘటన జరిగిన రోజు, సోహైల్ ఇక్బాల్, ఇతరులు గుంపును రెచ్చగొట్టారు. ‘‘జియా ఉర్ రెహ్మాన్ మాతో ఉన్నాడు, మేము మీతో ఉన్నాము, మేము మిమ్మల్ని రక్షిస్తాము. మీ లక్ష్యాన్ని పూర్తి చేయండి’’ అంటూ సోహైల్ గుంపుని రెచ్చగొట్టినట్లు తేలింది.
సర్వేలో అడ్డంకులు సృష్టించవద్దని అడ్మినిస్ట్రేటివ్ అధికారులు , పోలీసు పార్టీ గుంపును కోరిందని, అయితే గుమిగూడిన ప్రజలు నినాదాలు చేశారు, రాళ్లు రువ్వారు , పోలీసు వాహనాలు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. అనేక దుకాణాలకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని షూటర్ హత్య చేయాలనే ఉద్దేశ్యంతో సర్కిల్ ఆఫీసర్ అనుజ్ కుమార్ చౌదరిపై కాల్పులు జరిపాడు. అధికారి కుడి కాలికి బుల్లెట్ గాయమైంది. నేరస్తులను గుర్తించేందుకు డ్రోన్ ఫుటేజీలు, సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నామని, కఠినమైన జాతీయ భద్రతా చట్టం కూడా ప్రయోగించవచ్చని పోలీసులు తెలిపారు.