NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక విషయం..రూ. కోటి డిమాండ్..

Saif Ali Khan

Saif Ali Khan

Saif Ali Khan: గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లో దాడికి గురయ్యాడు. ఇంట్లోకి అక్రమంగా చొరబడిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయన ఆరు కత్తిపోట్లకు గురయ్యారు. మెడ, వెన్నుముకపై తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఆయనని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది ఇతడే.. సీసీకెమెరా వీడియో వైరల్..

ఇదిలా ఉంటే, ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దుండగుడిని పోలీసులు గుర్తించారు. అతను మెట్ల ద్వారా పారిపోతున్న వీడియోలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు 10 బృందాలతోప పోలీసులు గాలిస్తున్నారు. బంద్రాలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూరిన దుండగుడు, రూ. 1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. విడిచిపెట్టేందుకు రూ. కోటి డిమాండ్ చేసిన తర్వాత సైఫ్ అలీ ఖాన్, మరో ఇద్దరు సిబ్బందిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

ఈ ఘటనపై రాజకీయ దుమారం ప్రారంభమైంది. బీజేపీ ప్రభుత్వంలో ముంబై సురక్షితంగా లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఘటనను దురదృష్టకరమైందిగా పిలిచారు. ముంబై సురక్షితం కాదనే ప్రతిపక్షాల వాదనల్ని ఖండించారు. సెలబ్రెటీలు సురక్షితంగా లేకుంటే ముంబైలో ఎవరుంటారు.?. అని శివసేన ఠాక్రే వర్గం నేత ప్రియాంకా చతుర్వేది ప్రశ్నించారు. కేజ్రీవాల్, మమతా బెనర్జీలు కూడా బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శించారు.