DK Shivakumar: కర్ణాటకలో భారీ విజయం నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నికపై తర్జనభర్జన పడుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉన్నారు. అయితే వీరిద్దరి అభిమానులు ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా తమ నేతనే సీఎం అంటూ పోస్టర్లు పెట్టించారు. ఇదిలా ఉంటే డీకే శివకుమార్ సీఎం కావాలంటూ.. ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తాను చాలా సార్లు త్యాగం చేశానని అన్నారు. కాంగ్రెస్ గెలుపుతో ముఖ్యభూమిక పోషించిన లింగాయత్ వర్గానికి చెందిన మత కేంద్రం అయిన తుమకూరులోని సిద్ధగంగ మఠాన్ని సందర్శించిన తర్వాత ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు సిద్ధరామయ్యకు విభేదాలు ఉన్నాయని కొందరు అంటున్నారని, అయితే మా మధ్య విభేదాలు లేవని స్పష్టం చేస్తున్నానని శివకుమార్ అన్నారు. పార్టీ కోసం చాలాసార్లు త్యాగం చేసి సిద్ధరామయ్యకు అండగా నిలిచానని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే బెంగళూర్ లోని హోటల్ షాంగ్రీ-లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ మీటింగ్ జరుగుతోంది. దీనికి సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పగించాలని చెబుతూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు గురువారం కొత్తగా కర్ణాటకకు ముఖ్యమంత్రి, మంత్రిమండలి ప్రమాణస్వీకారం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకుంది. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. మొత్తంగా కాంగ్రెస్ బలం 137కు చేరుకుంది. బీజేపీ 66 స్థానాల్లో, జేడీయూ 19 స్థానాల్లో గెలుపొందింది.