Same-Gender Marriage: కేంద్ర మరోసారి స్వలింగ వివాహాలను వ్యతిరేకించింది. ఈ వివాహాలకు చట్టపరమైన అనుమతిని మంజూరు చేయడాన్ని కేంద్రం ఈ రోజు మరోసారి వ్యతిరేకించింది. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణించాలనేది ప్రతీ పౌరుడి ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్‌లను ‘‘పట్టణ ఉన్నతవర్గం’’ దృక్పథాన్ని ప్రతిబింబించేదిగా పేర్కొంటూ, వివాహాన్ని గుర్తించడం తప్పనిసరిగా చట్టబద్ధమైన విధి అని, దీనిని కోర్టులు నిర్ణయించడం మానుకోవాలని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు సంబంధించి చట్టబద్ధమైన ధ్రువీకరణను కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన స్పందనను తెలియజేసింది.
గ్రామీణ, పట్టణ జనాభా విస్తృత అభిప్రాయాలను, వారి వ్యక్తిగత చట్టాలు, వివాహ వ్యవస్థను నియంత్రించే ఆచారాలను దృష్టిలో ఉంచుకుని మతపరమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ చట్టాలు చేస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. వివాహం అనేది సామాజిక చట్టపరమైన సంస్థ అని పేర్కొంటూ..భారత రాజ్యాంగంలోని ఆర్టికట్ 246 ప్రకారం పార్లమెంట్ ద్వారా మాత్రమే ఇది గుర్తించబడుతుందని, చట్టపరమైన గుర్తింపు ఇస్తుందని కేంద్రం తెలిపింది. హిందూ, ముస్లిం వివాహ చట్టాల్లో వివాహం అనేది కేవలం పురుషుడు, స్త్రీ మధ్య జరిగే ఓ ప్రక్రియ మాత్రమే అని కేంద్రం పేర్కొంది.
Read Also: Gidugu Rudraraju: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. పార్టీని వీడినవారు తిరిగి రండి..!
ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్ కే వదిలేయాలని సుప్రీంకోర్టును కోరింది. దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరతూ దాఖలైన పిటిషన్లను మంగళవారం ఐదుగురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహా, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
హక్కులను సృష్టించడం, బంధాలను గుర్తించడం, చట్టబద్ధమైన పవిత్రతను ఇవ్వడం చట్టసభల ద్వారానే సాధ్యం అవుతుందని, న్యాయవ్యవస్థ పనికాదని కేంద్రం సూచించింది. కేవలం పట్టణ ప్రాంతాల్లోని కొద్ది మంది అభిప్రాయాలను ప్రతిబింబించే పిటిషన్లు అందరి అభిప్రాయాలను ప్రతిబింభించదని, సెమ్ సెక్స్ మ్యారేజ్ అనేది విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని కలిగి ఉంటుందని కేంద్రం పేర్కొంది.