NTV Telugu Site icon

Sachin Pilot: బీజేపీ నేతలకు సచిన్‌ పైలట్ కౌంటర్‌.. వాస్తవాలు తెలుసుకోవాలంటూ ట్వీట్‌

Sachin Pilot

Sachin Pilot

Sachin Pilot: మాజీ కేంద్ర మంత్రి రాజేష్‌ పైలట్ తనయుడు.. సచిన్‌ పైలట్‌ తన తండ్రిపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా మట్డాడకండి.. ప్రజలకు చెప్పే టప్పుడు వాస్తవంగా ఏమీ జరిగిందో తెలుసుకొని మాట్లాడాలని వార్నింగ్‌ ఇచ్చారు. తన తండ్రి బాంబ్‌లు వేసింది సొంత ప్రజలపై కాదని.. భారత్‌- పాకిస్థాన్‌ యుద్ధ సమయంలో అని.. అది కూడా బీజేపీ వారు చెప్పిన తేదిల్లో కాదని ట్విట్టర్‌ వేదికగా సచిన్‌ పైలట్‌ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సచిన్‌ పైలట్ ట్విట్టర్‌ లో పోస్టులో చేశారు.

Read also: Rajanikanth : తన వీరాభిమానికి సాయం చేసిన తలైవా.

భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవ్య ట్విట్టర్‌లో సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్ మరియు సురేష్ కల్మాడీలపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరూ 1966, మార్చి 5న మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సచిన్ పైలట్ సీరియస్‌గా స్పందించారు. మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ మీరు చెప్పిన డేట్లు, సమాచారం తప్పని ట్విట్టర్‌ వేదికగా సచిన్‌ పైలట్‌ స్పష్టం చేశారు. బీజేపీ నేత అమిత్ మాలవ్య ట్విట్టర్‌లో “1966, మార్చిలో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీ ఇండియన్‌ ఎయిర్ ఫోర్స్ ప్లేన్‌లో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌పై బాంబుల వర్షం కురిపించారు. తదనంతర కాలంలో వారిద్దరికీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్లు ఇచ్చి మంత్రులుగా కూడా చేర్చుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని సొంత ప్రజలపై దాడులు చేసినందుకు కానుకగా ఇందిరా గాంధీ వారికి ఆ పదవులు ఇచ్చారని స్పష్టంగా తెలుస్తోంది” అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు అమిత్‌ మాలవ్య. అమిత్ మాలవ్య పోస్టుకు సచిన్ పైలట్ బదులిస్తూ.. “మీ దగ్గర తప్పుడు తేదీలు.. తప్పుడు సమాచారముంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా మా నాన్న బాంబులు వేసిన మాట వాస్తవమేనని.. కానీ అది తూర్పు పాకిస్తాన్ పైన అని.. అదికూడా 1971లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం సందర్భంగా బాంబులు వేశారని స్పష్టం చేశారు. మీరు చెప్పినట్టు 1966, మార్చి 5న మిజోరంపై కాదన్నారు. మా నాన్న 1966, అక్టోబరు 29న విధుల్లో చేరారు. జై హింద్.. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.” అని రాసి కింద తన తండ్రి రాజేష్ పైలట్ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ లో జాయిన్‌ అయిన జాయినింగ్ డేటు ఉన్న సర్టిఫికేటును ట్విట్టర్‌లో పోస్టు చేశారు.