NTV Telugu Site icon

Asaduddin Owaisi: అతీక్ అహ్మద్ హత్యపై ఘాటుగా స్పందించిన అసదుద్దీన్

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అతిక్, అతని సోదరుడి దారుణ హత్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తుల చేతులకు సంకెళ్లు కూడా ఉన్నాయి. అలాంటి వారిని గుర్తు తెలియని వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపడం దారుణమైన ఘటన అని అన్నారు. జైశ్రీరామ్ నినాదాలు చేసిన దుండగులు, నిందితులను పోలీసులు అడ్డుకోకపోవడాన్ని అసదుద్దీన్ తప్పుబట్టారు. యోగి పాలనలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఎన్ కౌంటర్లు జరిగితే సంబరాలు చేసుకుంటున్న ఎన్ కౌంటర్ రాజ్యం కూడా హత్యతో సమానం అంటూ ట్వీట్ చేశారు. ఇదేనా న్యాయవ్యవస్థ, న్యాయం జరిగే తీరు అరి యూపీ సీఎం యోగి ప్రభుత్వాన్ని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఒవైసీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏ అధికారి కూడా దర్యాప్తులో పాల్గొనవద్దని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధంగా ప్రభుత్వాన్ని నడపడం లేదని.. తుపాకీ పాలనతో ప్రభుత్వం నడుస్తోందని ఒవైసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఉమేష్ పాల్ హత్య కేసులో అరెస్టయిన అతిక్ అహ్మద్‌ను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్తుండగా సమీపంలోని కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతిక్‌తో పాటు అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ కూడా అక్కడిక్కడే చనిపోయాడు. మరోవైపు గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ను పోలీసులు గురువారం ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడో రోజు కాల్పుల ఘటనలో గ్యాంగ్‌స్టర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు చనిపోయారు. దీంతో.. ప్రయాగ్‌రాజ్‌లో సెక్షన్ 144 కింద విచారణకు సీఎం యోగి ఆదేశించారు.

ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. ఘటనా స్థలాన్ని సందర్శించాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ సంజయ్‌ ప్రసాద్‌ను ఆదేశించారు. గ్యాంగ్‌స్టర్‌ను దారుణంగా హత్య చేసిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రయాగ్‌రాజ్‌లో సెక్షన్ 144 విధించారు. శనివారం ప్రయాగ్‌రాజ్‌లో అతిక్ అహ్మద్, అతని సోదరుడిని కాల్చి చంపిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను లవలేష్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యలుగా పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసుతోపాటు ఓ జర్నలిస్టు కూడా గాయపడినట్లు సమాచారం.


Atiq Ahmad : అతీక్ అహ్మద్ ఆర్థిక మూలాలను దెబ్బకొడుతున్న యూపీ సర్కార్