Site icon NTV Telugu

Odisha: ఒడిశా అసెంబ్లీని కుదిపేసిన ‘ర్యాగింగ్’ భూతం..

Odisha Assembly

Odisha Assembly

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బక్షి జగబంధు కళాశాలలో విద్యార్థి రుచికా మహంతి ఆత్మహత్య ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. కళాశాల ఆవరణ నుంచి శాసనసభ వరకు ఆందోళన సెగలు విస్తరించాయి. ఈ విచారకర పరిస్థితులను ప్రభుత్వం ఇంకెంత కాలం నిరీక్షిస్తుందని విద్యార్థి సంఘాలు నిలదీస్తున్నాయి. ర్యాగింగ్ వేధింపులకు పాల్పడిన వారిపట్ల కఠిన చర్యలు చేపడతామని కళాశాల యాజమాన్యం, పోలీసు వర్గాలు భరోసా ఇస్తున్నాయి. రుచికా మహంతి ఆత్మహత్య ఘటనపై విచారణ పురస్కరించుకుని ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటైంది. కళాశాల యాజమాన్యం దీనిని నియమించింది. ర్యాగింగ్‌ వ్యతిరేక కమిటీ, క్రమశిక్షణ కమిటీ, అన్ని విభాగాల అధ్యాపకులతో ఏర్పాటు చేశారు. ర్యాగింగ్‌కు సంబంధించి రుచికా మహంతి గతంలో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. త్వరలో ఘటనకు సంబంధించి వివరాలు వెలుగులోకి వస్తాయని బీజేబీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిరంజన్ మిశ్రా వెల్లడించారు.

Mamata Benerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది..

విద్యార్థిని రుచికా మహంతి ఆత్మహత్య, ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ ఉదంతాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు శాసనసభలో సోమవారం డిమాండ్ చేశాయి. సోమవారం బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులంతా సభాపతి పోడియంవద్దకొచ్చి నినాదాలు చేశారు. ఈ విచారకర పరిస్థితుల పట్ల పూర్తి వివరణ సభలో ప్రవేశ పెట్టాలని సోమవారం జరిగిన వర్షాకాల సమావేశాల్లో సభ్యులు విరచుకు పడ్డారు. స్పీకర్‌ పోడియం వైపు దూసుకుపోయారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ సంఘటనలు పెరుగుతున్నాయని, యాంటీ ర్యాగింగ్‌ చట్టాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి దీనిపై ప్రత్యేక చర్చకు అనుమతించాలని విపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. రుచికా సంఘటనపై దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కోరారు. జీరో అవర్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించాలని సభాపతి అరుక్‌ విపక్షాలను కోరినా వినకుండా పోడియం వద్దకు చేరి నినదించడంతో మధ్యాహ్నం వరకు కార్యక్రమాలను వాయిదా వేశారు. తర్వాత సభ కొలువుదీరినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగనీయాలన్న స్పీకర్‌ పిలుపుని నిరాకరించడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు గుర్తించి, సభా కార్యక్రమాలను వాయిదా వేశారు.

Exit mobile version