RSS Changes Profile Pictures Of Social Media Accounts To National Flag: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శుక్రవారం తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ ను మార్చడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆర్ఎస్ఎస్ కాషాయ జెండానే తన సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్ గా ఉంటుంది. అయితే తాజాగా కాషాయ జెండాను మార్చి జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్ గా పెట్టింది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరపుకుంటోంది. ఆగస్టు 2 నుంచి 15 వరకు సోషల్ మీడియా ప్రొఫైల్ పిక్చర్ గా ‘ తిరంగా’ జెండాను ఉంచాలని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఆగస్టు 13-15 తేదీలలో ప్రజలు తమతమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగరవేయాలని ఆయన కోరారు.
గతంలో ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను గురించి కాంగ్రెస్ పార్టీలో పలు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్చర్ మార్చాలని సూచించిన సమయంలో కాంగ్రెస్ నేతలు పలు విమర్శలు చేశారు. 52 ఏళ్లుగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఎగరని జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుంటారా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఆర్ఎస్ఎస్ అన్ని కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేస్తామని ఆర్ఎస్ఎస్ ప్రచార విభాగం ఇంచార్జ్ నరేందర్ ఠాకూర్ అన్నారు. హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహెత్సవ్ కార్యక్రమాల్లో ఆర్ఎస్ఎస్ పాల్గొంటుందని.. ప్రభుత్వ,ప్రైవేట్ కార్యక్రమాల్లో తమ స్వయం సేవకులు పాల్గొంటారని.. ఆర్ఎస్ఎస్ నాయకుడు సునీత్ అంబేకర్ అన్నారు.
ఇటీవల కాలంలో బీజేపీని విమర్శిస్తున్న క్రమంలో.. భారత్ హిందూ దేశం అవుతుందని.. త్వరలో ఆర్ఎస్ఎస్ జెండానే జాతీయ జెండా అవుతుందని పలు విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ తన సోషల్ మీడియా పిక్ మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యతో ఇటు బీజేపీ, అటు ఆర్ఎస్ఎస్ విపక్షాల విమర్శలకు చెక్ పెట్టే అవకాశం ఉంది.