Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్‌.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ

  • కోడి కోసం కొట్టుకున్న యువకులు..
  • తమిళనాడు తిరుపత్తూరు జిల్లా వాణియంబడిలో ఘటన..
  • రూ.25 వేల విలువైన పందెంకోడిని దొంగలించి తిన్న యువకులు..
  • కోడి కనిపించడం లేదంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఫొటోలు పెట్టి ఆరా..
Cock Fight

Cock Fight

Tamil Nadu: తమిళనాడు తిరుపత్తూరు జిల్లా వాణియంబడిలో పందెంకోడి కోసం యువకుల మధ్య జరిగిన ఘర్షణ కలకలం రేపింది. రూ.25 వేల విలువైన కోడిని దొంగలించి చికెన్ షాపులో క్లీన్ చేసి తిన్నారనే ఆరోపణలతో మొదలైన వివాదం చివరకు దాడికి దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జాఫ్రాబాద్‌కు చెందిన ఖాదర్ పందెంకోళ్లను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడి వద్ద ఉన్న సుమారు రూ.25 వేల విలువైన పందెంకోడి బుధవారం కనిపించకుండా పోయింది. కోడి కోసం పరిసర ప్రాంతాల్లో ఆరా తీసిన ఖాదర్.. దాని ఫొటోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి, ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరాడు.

ఈ క్రమంలో పల్లెపట్టు ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు ఆ కోడిని తీసుకెళ్లి చికెన్ షాపులో క్లీన్ చేసి తిన్నట్లు ఖాదర్‌కు సమాచారం అందింది. దీంతో సంబంధిత యువకులను ఖాదర్ ప్రశ్నించాడు. ఈ విషయం యువకుల మధ్య వివాదానికి దారితీసింది. తమపైనే ఆరోపణలు చేస్తావా అంటూ ఆగ్రహించిన యువకులు చికెన్ షాపుకు చెందిన ముగ్గురిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, నడిరోడ్డుపై యువకుల మధ్య ఘర్షణ జరగడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, గొడవకు దారితీసిన కారణాలు, కోడిని ఎవరు తీసుకెళ్లారు, దాడికి పాల్పడిన వారెవరనే అంశాలపై విచారణ చేపట్టారు.