Site icon NTV Telugu

కాంగ్రెస్‌కు కీల‌క నేత షాక్‌.. బీజేపీ గూటికి కేంద్ర మాజీ మంత్రి

అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉత్తర్‌ప్రదేశ్ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు జ‌రుగుతున్నాయి.. ఆదిలోనే అధికార బీజేపీ పార్టీని దెబ్బ కొడుతూ.. ముగ్గురు మంత్రుల‌ను, 10 మందికి పైగా ఎమ్మెల్యేల‌ను స‌మాజ్‌వాదీ పార్టీలో చేర్చుకున్నారు అఖిలేష్ యాద‌వ్.. ఆ త‌ర్వాత ముల‌యాంసింగ్ ఫ్యామిలీని టార్గెట్ చేసి.. ఆ కుటుంబంలోని ఇద్ద‌రికి బీజేపీ కండువా క‌ప్పారు.. మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తూనే ఉంది బీజేపీ.. ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌ల‌కు కండువా క‌ప్పారు.. ఇక‌, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో.. కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఉన్న కేంద్ర మాజీ మంత్రి, రాహుల్ గాంధీకి అత్యంత స‌న్నిహితుల్లో ఒక‌రిగా పేరున్న ఆర్​పీఎన్​ సింగ్​.. ఇప్పుడు కాంగ్రెస్​కు గుడ్‌ బై చెప్పేశారు. ఇవాళ భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది యూపీ రాజ‌కీయాల‌తో పాటు, కేంద్ర రాజ‌కీయాల్లో కూడా పెద్ద చ‌ర్చ‌గా మారింది.

యూపీ కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా ఉన్న ఆర్​పీఎన్​ సింగ్‌కు ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌గిన ప్రాధాన్య‌తే ఇచ్చింది పార్టీ.. పడ్రానా నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయ‌న‌ను.. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల స్టార్​ క్యాంపెయినర్​ లిస్టులోనూ స్థానం క‌ల్పించింది పార్టీ.. అంతేకాదు.. రాహుల్​ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారాయ‌న‌.. కానీ, ఉన్న‌ట్టుండి ఇవాళ ఉద‌యం సోష‌ల్ మీడియా వేదిక‌గా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి చ‌ర్చ‌కు తెర‌లేపారు.. ప్రస్తుతం మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. నా రాజకీయ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు ఆర్​పీఎన్​ సింగ్‌.. ఇక‌, ఇవాళ మ‌ధ్యాహ్నం డిప్యూటి సీఎం కేశవ ప్రసాద్​ మౌర్య, యూపీ బీజేపీ ఇన్​చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్​ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.. ఇక‌, ఈ కార్యక్రమంలో బీజేపీ యూపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్​ సింగ్​, కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​, జ్యోతిరాదిత్య సింధియా త‌దిత‌రులు పాల్గొన్నారు. మ‌రోవైపు.. ఆర్‌పీఎన్ సింగ్‌.. కాంగ్రెస్ పార్టీని వీడ‌డానికి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి.. ఆయ‌న అనుచ‌రుల‌కు కాంగ్రెస్ టికెట్లు నిరాక‌రించింద‌ని కొంద‌రు.. బీజేపీ నుంచి మంచి ఆఫ‌ర్ అందుకున్నాడ‌ని ఇంకా కొంద‌రు చేస్తున్న కామెంట్లు.

Exit mobile version