NTV Telugu Site icon

Himachal Pradesh: హిమాచల్ రాజకీయాల్లో ‘మసీదు’ వివాదం.. లవ్‌జీహాద్‌పై కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు..

Himachal

Himachal

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మసీదు నిర్మాణం వివాదాస్పదమవుతోంది. మసీదును అక్రమంగా నిర్మిస్తు్న్నారని సిమ్లాలో స్థానిక ప్రజలు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఈ రోజు భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని సంజౌలి‌లోని మార్కెట్ పక్కనే నిర్మిస్తున్న మసీదు చట్టవిరుద్ధంగా ఉందని, అక్రమ నిర్మాణమని పేర్కొంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి రావడంతో ఈ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. రాష్ట్రంలో నిర్మాణాలకు కేవలం రెండున్నర అంతస్తులు ఉండగా, మసీదు నాలుగు అంతస్తు్ల్లో నిర్మితమవుతోందని ఆరోపించారు.

ఇదిలా ఉంటే, మసీదు నిర్మాణంపై అధికార కాంగ్రెస్ నేత, మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి అక్రమ మసీదు నిర్మాణాన్ని సభలోనే వ్యతిరేకించారు. అయితే, మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మంత్రి అనిరుధ్ సింగ్ మాట్లాడుతూ.. మసీదు నిర్మాణంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. మసీదును అక్రమంగా నిర్మించడం ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచిందని చెప్పారు.

Read Also: RG Kar hospital: వెలుగులోకి సందీప్ ఘోష్ ఆగడాలు.. వైద్యురాలు హత్యాచారం తర్వాత మాజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే..!

మసీదుని తెరవడానికి ముందు అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా..? అని గ్రామీణాభివృద్ధి మంత్రి అనిరుధ్ సింగ్ ప్రశ్నించారు. వారికి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని, వారు 5 అంతస్తుల్లో మసీదుని నిర్మించారని, ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సంజౌలి మార్కెట్ ప్రాంతంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయని, లవ్ జిహాద్‌పై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. “సంజౌలీ మార్కెట్‌లో మహిళలు నడవడం కష్టంగా మారింది, దొంగతనాలు జరుగుతున్నాయి… లవ్ జిహాద్ మరొక తీవ్రమైన సమస్య, ఇది మన దేశానికి మరియు రాష్ట్రానికి ప్రమాదకరం. పోరాటాలు జరుగుతున్నాయి” అని ఆయన అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై తోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.

ప్రస్తుతం ఈ మసీదు నిర్మాణం హిమాచల్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మసీదుకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై సీఎం సుఖ్వీందర్ సుఖు మాట్లాడారు. అన్ని మతాలను గౌరవిస్తామని, ఎవరూ చట్టాన్ని చేతిలోకి తీసుకోరాదని హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. హిమాచల్ ప్రభుత్వాన్ని బీజేపీ నడుపుతోందా..? కాంగ్రెస్ నడుపుతోందా..? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్ వైఖరిని విమర్శించారు. హిమాచల్‌లో ‘‘మొహబ్బత్ కి దుకాన్’’లో ద్వేషం మాత్రమే ఉంది, హిమాచల్ మంత్రి బీజేపీ భాషలో మాట్లాడుతున్నారని ఓవైసీ విమర్శించారు. మాజీ సీఎం, బీజేపీ నేత జై రామ్ ఠాకూర్ మాట్లాడుతూ.. మసీదు అక్రమంగా నిర్మించడం దురదృష్టకరం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Show comments