NTV Telugu Site icon

Wolf attacks: మనుషులపై తోడేళ్ల ప్రతీకారం, వాటి పిల్లల్ని చంపినందుకేనా.? యూపీ దాడుల వెనక కారణం..

Bahraich Wolf Attacks

Bahraich Wolf Attacks

Wolf attacks: ఉత్తర్ ప్రదేశ్ వరస తోడేళ్ల దాడులతో భయాందోళనకు గురవుతోంది. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలోని పలు గ్రామాల్లో మనుషులే టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నాయి. వీటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. వందలాది మంది అధికారుల్ని, బలగాలను మోహరించారు. మొత్తం ఆరు తోడేళ్లు కలిగిన గుంపులో ప్రస్తుతానికి నాలుగింటిని పట్టుకున్నా, మిగతా రెండు మాత్రం వాటి దాడుల్ని కొనసాగిస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా పిల్లలని సులభమైన లక్ష్యాలుగా ఎంచుకుని, ఇళ్లలో నుంచి వారిని లాక్కెళ్లి చంపి, తింటున్నాయి. నరమాంసానికి మరిగిన తోడేళ్లు సెప్టెంబర్ 2 వరకు ఏడుగురు పిల్లలలో సహా ఎనిమిది మందిపై దాడి చేసి చంపేశాయి. 36 మంది వీటి దాడుల్లో గాయపడ్డారు. మార్చి నుండి బహ్రైచ్‌లో పిల్లలతో సహా మనుషులపై తోడేళ్ల దాడులు జరుగుతున్నాయి, అయితే వర్షాకాలంలో జూలై 17 నుండి అవి పెరిగాయి.

అయితే, ఈ దాడుల వెనక తోడేళ్ల ప్రతీకారం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ ఆవాసాలను కోల్పోవడం లేదా పిల్లల్ని చంపడం వంటి కారణాలు మనుషులపై ప్రతీకారంతో దాడులు చేసేందుకు దోహడపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీనికి బలం చేకూరుస్తూ.. తోడేళ్ల దాడులకు ముందు రెండు తోడేడు పిల్లలు ట్రాక్టర్ ఢీ కొట్టడంతో మరణించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచే దాడులు ప్రారంభమయ్యాయని బాధిత గ్రామస్తులు చెబుతున్నారు.

Read Also: IC 814 Hijack: IC 814 ఫ్లైట్ హైజాక్.. ఉగ్రవాది శవాన్ని హైజాకర్లు ఎందుకు కోరారు..? సజ్జాద్ ఆఫ్ఘనీ ఎవరు..?

బహ్రైచ్ జిల్లాలోని కతర్నియాఘాట్ వైల్డ్‌లైఫ్ డివిజన్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) రిటైర్డ్ అధికారి మరియు మాజీ ఫారెస్ట్ ఆఫీసర్ జ్ఞాన్ ప్రకాష్ సింగ్ మాట్లాడుతూ, తోడేళ్ళు ఇతర క్రూర జంతువుల మాదిరిగా కాకుండా, ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉన్నాయని చెప్పారు. నా అనుభవం ఆధారంగా, తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే ధోరణి ఉందని చెప్పవచ్చని అన్నారు. గతంలో మానవులు తోడేళ్లకు ఏదో విధంగా హాని కలిగించడం మూలంగానే దాడులు జరుగుతున్నాయని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌, ప్రతాప్‌గఢ్‌ జిల్లాల్లోని సాయి నది పరివాహక ప్రాంతంలో 25 ఏళ్ల క్రితం 50 మందికి పైగా చిన్నారులను తోడేళ్లు చంపేశాయని చెప్పారు. విచారణలో కొంతమంది పిల్లలు ఒక డెన్‌లో ఉన్న రెండు తోడేళ్లను చంపినట్లు తేలిందని చెప్పారు. ఆ తర్వాత వీటి తల్లిదండ్రులైన తోడేళ్లు దూకుడుగా మారాయని తేలింది. బహ్రైచ్‌లో జనవరి, ఫిబ్రవరిలో రెండు తోడేలు పిల్లలు ట్రాక్టర్ చక్రాల కింద నలిగిపోయాయని సింగ్ చెప్పారు.

కోపంతో ఉన్న తోడేళ్లను దాడులు ప్రారంభించడంతో వాటిని పట్టుకుని 40 కి.మీ దూరంలో ఉన్న చకియా అడవుల్లో వదిలేశారు. అయితే, చకియా అనేది తోడేళ్లకు సహజ నివాసం కాదని, అదే తోడేళ్లు తిరిగి ప్రతీకారం కోసం వచ్చాయని ఆయన చెప్పారు. పట్టుకున్న నాలుగు తోడేళ్ల గురించి మాట్లాడుతూ.. ఒక వేళ నరమాంస భక్షక తోడేళ్లు పట్టుబడితే దాడులు ఆగిపోయేవని అన్నారు. వీటిని పట్టుకున్న తర్వాత కూడా మనుషులుపై దాడులు జరిగాయని చెప్పారు.

బహ్రైచ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అజిత్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, సింహాలు మరియు చిరుతపులులు కూడా ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉండవని, కానీ తోడేళ్లు మాత్రం ప్రతీకారం తీర్చుకుంటాయని చెప్పారు. తోడేళ్ల నివాసినికి భంగం కలిగినా, వాటి పిల్లలకు హాని కలిగించినా అవి దాడులు చేస్తాయని చెప్పారు. ప్రస్తుతం యూపీలో ఒక వేళ నరమాంస భక్షక తోడేళ్లు దొరకకపోతే, కాల్చి చంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Show comments