Water Crisis: వేసవి కాలం పూర్తిగా రాకముందే దేశంలోని పలు నగరాలు నీటి సంక్షోభంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇండియా సిలికాన్ వ్యాలీ బెంగళూర్ నీటి కొరతతో ఇబ్బందులు పడుతోంది. నగర వాసులకు రోజుకు 2600 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా.. ఇప్పటికే 500 మిలియన్ లీటర్ల కొరత ఉంది. బెంగళూరులో 14,000 బోర్‌వెల్‌లు ఉండగా వాటిలో 6,900 ఎండిపోయాయి. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే రాబోతున్నాయా.?? అంటే రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యాన్ని చూస్తే సంక్షోభం తప్పేలా లేదని అనిపిస్తోంది.
Read Also: Delhi Metro: హోలీ రోజున ప్రయాణికులకు ఢిల్లీ మెట్రో అలర్ట్
వేసవికి ముందే దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో ప్రస్తుత నిల్వ సామర్థ్యం వాటి మొత్తం సామర్థ్యంలో కేవలం 38 శాతం మాత్రమే ఉంది. గత దశాబ్ధపు సగటులో పరిశీలిస్తే, ఈ కాలానికి అతితక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ వీక్లీ బులెటిన్ ప్రకారం.. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో గతేడాదితో పోలిస్తే ఇదే కాలానికి తక్కువ నిల్వ స్థాయిలు నమోదయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ (రెండు రాష్ట్రాలలో కలిపి రెండు ప్రాజెక్టులు), తమిళనాడుతో సహా అనేక ఇతర రాష్ట్రాలు కూడా గతేడాదితో పోలిస్తే తక్కువ నీటి నిల్వ స్థాయిలను నివేదించాయి. అధికార సమాచారం ప్రకారం.. ఈ 150 రిజర్వాయర్లలో మొత్తం నిల్వ సామర్థ్యం 178.784 BCM, ప్రస్తుతం ఈ రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న ప్రత్యక్ష నిల్వ 67.591 BCMగా ఉంది. ఇది 38 శాతం. గతేడాది ఇదే కాలానికి 80.557 BCM లైవ్ స్టోరేజీ అందుబాటులో ఉంది, గత దశాబ్దంలో సగటున 72.396 BCMగా ఉంది.
