NTV Telugu Site icon

Big Breaking: రాజీవ్‌ గాంధీ హత్య కేసు.. సుప్రీం సంచలన తీర్పు

Perarivalan

Perarivalan

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.. ఆ కేసులో దోషిగా ఉన్న పేరారివాలన్ 31 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో 31 ఏళ్లుగా జైలు జీవితం గడిపిన యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. నళిని శ్రీహరన్‌, శ్రీలంక జాతీయుడైన ఆమె భర్త మురుగన్‌తో సహా ఈ కేసులో మరో ఆరుగురు దోషుల విడుదలకు ఈ తీర్పు మార్గం సుగమం చేసింది. హత్య జరిగినప్పుడు 19 ఏళ్ల వయసులో ఉన్న పెరారివాలన్‌.. హత్యకు సూత్రధారి అయిన ఎల్టీటీఈకి చెందిన శివరాసన్ నుంచి రెండు 9-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రాజీవ్ గాంధీని హత్య చేసేందుకు బాంబులో బ్యాటరీలను ఉపయోగించారు.

1998లో పేరారివాలన్‌కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షను సమర్థించింది.. కానీ, 2014లో దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే, ఈ ఏడాది మార్చిలో, ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. కొంతకాలం తర్వాత, పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేసినా.. అతడి అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది, తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ దృష్టికి తీసుకెళ్లారు.. కానీ, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అయితే, ఈ వ్యవహారంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న కేబినెట్‌ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, దాంతో రాష్ట్రపతి స్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు స్పష్టం చేసింది.. గత వారం విచారణలో, క్షమాపణ మంజూరు చేసే కేసులలో, రాష్ట్రపతికి మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న కేంద్రం వాదనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో, వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదులకు మార్చింది. వారిలో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు శిక్షను 2000లో రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ జోక్యంతో మార్చారు, ఎందుకంటే ఆ మహిళ జైలులో ఉన్నప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక, జయలలిత, పళనిసామి నేతృత్వంలోని తమిళనాడు మంత్రివర్గం 2016, 2018లో దోషులను విడుదల చేయాలని సిఫారసు చేసినప్పటికీ, వరుసగా వచ్చిన గవర్నర్లు దానిని పట్టించుకోలేదు. చాలా ఆలస్యం తర్వాత వారు దానిని రాష్ట్రపతికి పంపించారు..

ఇక, పెరారివాలన్, ఇతరులు 16 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇతర దోషుల మాదిరిగానే వారికి ఉపశమనం లభించకపోవడంతో కోర్టులను ఆశ్రయించారు. వారు ఇప్పుడు మూడు దశాబ్దాలు జైలు జీవితం గడిపారు. చాలా ఏళ్ల పాటు ఏకాంత ఖైదులో ఉన్న పెరారివాలన్ జైలులో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. సుదీర్ఘ ఖైదు సమయంలో అతను అనేక విద్యా అర్హతలను సంపాదించాడు. అతను ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో త్వరలోనే విడదల కాబోతున్నారు.