Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన ఉమర్ నబీ దుష్ట పథకం పన్నినట్లు తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నాడని అధికారులు తెలిపారు. అయితే, అతడి ఉగ్ర స్నేహితులు దొరికిపోవడంతో, నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కాశ్మీర్ పుల్వామాకు చెందిన 28 ఏళ్ల ఉమర్ నబీ ఆత్మాహుతికి పాల్పడి 12 మంది మృతికి కారణమయ్యాడు.
Read Also: Bangaldesh: బంగ్లాదేశ్‌లో హై అలర్ట్.. రేపు షేక్ హసీనా కేసులపై తీర్పు..
ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో టీచింగ్ డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైబ్ అరెస్ట్‌తో ఉమర్ ప్లాన్ విఫలమైంది. ముజమ్మిల్ గదిలో 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. దీంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడని, ఈ నేపథ్యంలోనే ఎర్రకోట వద్ద పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. జైషే మహ్మద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉన్న 8 మందిని విచారించడంతో, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఉగ్రవాద నెట్వర్క్‌తో ఉమర్‌కు చాలా సంబంధాలు ఉన్నట్లు తేలింది. 2021లో ననైతో కలిసి నబీ టర్కీ పర్యటనకు వెళ్లాడు. అక్కడే ఇతడికి ఉగ్రవాదంతో పరిచయమేర్పడినట్లు తెలిసింది. వీరిద్దరు కూడా టర్కీలోనే జైషే మహ్మద్ హ్యాండ్లర్‌ను కలిసినట్లు తెలిసింది. దీని తర్వాత, ఇద్దరూ కలిసి అల్ ఫలాహ్ యూనివర్సిటీ చుట్టుపక్కల నుంచి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరించడం ప్రారంభించారని తెలిసింది.
