NTV Telugu Site icon

PM Modi On Red Diary: రెడ్‌ డైరీనే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను ముంచుతుంది: ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi On Red Diary: రాజస్థాన్‌ ప్రభుత్వం ఆర్థిక అవక తవకలకు పాల్పడిందని మాజీ మంత్రి రాజేంద్ర గూడ రెడ్ డైరీ పేరుతో చేసిన ఆరోపణల నేపథ్యంలో .. అదే రెడ్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోడీ రాజస్థాన్‌లోకి సీకర్‌లో జాతికి అంకితం చేశారు. సీకర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 1.25 లక్షల ‘పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ప్రధాని జాతికి అంకితం చేశారు. విత్తనాల నుంచి మార్కెటింగ్‌ వరకు తొమ్మిదేళ్ల పాలనలో రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఇటీవల రాజస్థాన్‌లో కలకలం రేపిన ‘రెడ్‌ డైరీ’లోని రహస్యాలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని నాశనం చేస్తాయన్నారు. అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందన్న వివరాలు రెడ్‌ డైరీలో ఉన్నాయంటూ ఇటీవల ఉద్వాసనకు గురైన మంత్రి రాజేంద్ర గుడా పేర్కొన్న విషయం తెలిసిందే.

Read also: Vikarabad: వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్.. కోట్ పల్లి ప్రాజెక్ట్ వద్ద పరిస్థితులపై ఐజీ షనవాజ్ ఖాసీం ఆరా

బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ యూరియా ధరల భారం రైతులపై పడకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. భారత్‌లో యూరియా సంచి ధర రూ. 266 ఉండగా.. పాకిస్థాన్‌లో దాదాపు రూ.800గా ఉందని.. బంగ్లాదేశ్‌లో రూ.720, చైనాలో రూ.2100లకు దొరుకుతున్నాయని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ వికాసం సాధ్యమవుతుందన్నారు. నగరాల్లో లభించే ప్రతి సౌకర్యాన్ని పల్లెలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకూ ప్రధాని మోదీ శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేశారు. రాజస్థాన్‌లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనే తమ ప్రాధాన్యమని.. రాబోయే ఎన్నికల్లో భాజపాదే విజయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావల్సిందని.. కానీ ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాలేకపోయారు. ఆయన కాలికి గాయమైంది. సీఎం గేహ్లాట్‌ వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని మోడీ అన్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో ప్రధాని మోదీ పర్యటించడం .. ఆరు నెలల వ్యవధిలో ఇది ఏడోసారి కావడం విశేషం.