Ranya Rao Case: బంగారం అక్రమ రవాణా కేసులో సినీ నటి రన్యా రావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆమెపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవని న్యాయమూర్తి విశ్వనాథ్ సీ గౌడర్ అన్నారు. జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలనే ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించారు. ఇప్పటికే ఆమె బెయిల్ పిటిషన్‌ని మొదట మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టుని ఆశ్రయించగా, అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆమె తరుపు న్యాయవాదులు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నవారు.
Read Also: Green Card: గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన “శాశ్వత నివాసం” కాదు: యూఎస్ వైస్ ప్రెసిడెంట్..
12 కోట్ల రూపాయల విలువైన 14.8 కిలోగ్రాముల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై రన్యా రావును మార్చి 4, 2025న అరెస్టు చేశారు. సినీ నటి కావడం, ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ కావడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడింది. నడుము బెల్టులో బంగారాన్ని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కనుగొంది. మొత్తం ఆమె నుంచి రూ. 17.29 కోట్ల విలువైన బంగారం, నగదుని స్వాధీనం చేసుకున్నారు.
రన్యా రావు దాదాపుగా 30 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ప్రతీ సందర్భంలోనూ ఆమె పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆమె అక్రమంగా తరలించే ప్రతీ కిలో బంగారానికి లక్ష రూపాయాలు సంపాదించిందని, ఒక్కో ట్రిప్పుకు రూ. 12-13 లక్షలు సంపాదించేదని తెలిసింది. బెంగళూర్ విమానాశ్రయంలో ప్రోటోకాల్ సహాయాన్ని అందించడానికి, ఆమె సవతి తండ్రి డీజీపీ రామచంద్రరావు ఆర్డర్ ఇచ్చే వాడని ఎయిర్ పోర్టు విధుల్లో ఉన్న కానిస్టేబుల్ విచారణలో చెప్పాడు. ఈ కేసులో అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఈడీ కర్ణాటక వ్యాప్తంగా దాడులు ప్రారంభించింది. మరోవైపు, సీబీఐ రన్యారావు వివాహం, పెళ్లికి వచ్చిన గెస్ట్‌లు, వారితో ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.