Rakhis for Gurmeet Ram Rahim:హర్యానా డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్ కు ఇబ్బడిముబ్బడిగా రాఖీలు, గ్రీటింగ్ కార్డులు వచ్చిపడుతున్నాయి. దీంతో పోస్టల్ శాఖ వాటిని వేరు చేసేందుకు పగలు రాత్రి కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ ఏడాది రక్షా బంధన్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన డేరా బాబా భక్తులు రామ్ రహీమ్ సింగ్ కు వేలల్లో రాఖీలు పంపుతుంటారు. ప్రస్తుతం రోహ్ తక్ లోని సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్ సింగ్ కు వచ్చిన గ్రీటింగ్ కార్డులను, రాఖీలను పోస్టల్ శాఖ పెద్దపెద్ద సంచుల్లో తరలిస్తుంటుంది.
అయితే గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ సారి రక్షా బంధన్ రాఖీలు తక్కువగా వచ్చాయని పోస్టల్ శాఖ తెలిపింది. గత ఏడు రోజుల్లో డేరా బాబా భక్తులు, మద్దతుదారుల నుంచి కేవలం రెండు వేలలోపు రాఖీలు మాత్రమే వచ్చాయని పోస్టల్ శాఖ తెలిపింది. గతేడాది 27 వేల రాఖీలు వచ్చాయని తెలిపారు. రామ్ రహీమ్ కు ఈ ఏడాది రాఖీలు తక్కువగా రావడం పోస్టల్ ఆదాయానికి గండికొట్టింది.
Read Also: Elon Musk own social media: ఎలాన్ మస్క్ సంచలనం.. సొంతంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్.. పేరు ఇదే..!
గత నాలుగేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రాహీమ్ సింగ్ కు వేలల్లో రాఖీలు, గ్రీీటింగ్ కార్డులు వస్తున్నాయి. రక్షాబంధన్ పండగకు సంబంధించి 10-15 రోజుల పాటు ఇలా రాఖీలు వస్తూనే ఉంటాయి. ఈ రాఖీలను వేరు చేసి రిక్షాలను అద్దెకు తీసుకుని మూటల్లో సునారియా జైలుకు తరలిస్తుంటుంది పోస్టల్ శాఖ. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో పాటు తన 2002లో డేరా బాబా ఆశ్రమ మేనేజర్ రంజిత్ సింగ్, జర్నలిస్ట్ హత్యలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ హత్యల కేసులో ఆయనకు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ ఖైదును విధించింది.
