Rakesh Tikait: మరోసారి భారత కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ భారీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ఆందోళనలు చేసిన రాకేష్ టికాయత్.. ప్రస్తుతం కేంద్రం తీసుకుచ్చని ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నిపథ్’ఫై ఆందోళనకు సిద్ధం అవుతున్నాడు. ఆగస్టు 7 నుంచి అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా తమ రైతు సంఘం ప్రచారం ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. ఆగస్టు 7న ప్రారంభం అయ్యే ఆందోళనలు వారం పాటు సాగుతాయని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే కేంద్రం, యూపీ ప్రభుత్వాలపై రాకేష్ టికాయత్ ఆరోపణలు చేశారు. రైతుల్ని భయపెట్టడానికి పాత కేసులు తవ్వుతున్నారని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీజేపీ సభ్యులపై కేసులు మూసేశారని విమర్శించారు. వారంతా కేసులకు సిద్ధంగా ఉండాలని రాకేష్ టికాయత్ హెచ్చరించారు. మేము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని.. లక్నో, ఢిల్లీలో ఉన్న వారు జాగ్రత్తగా వినాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు.
Read Also: Indrasena Reddy: కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు.
మీరు రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయవచ్చు.. రైతు సంఘాల నాయకులను విడదీయవచ్చని…కానీ రైతులను విచ్ఛిన్నం చేయలేరని అన్నారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతారని ఆయన స్పష్టం చేశారు. రైతుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, చెరుకు రైతులకు పెండింగ్ లో ఉన్న బకాయిల గురించి రాకేష్ టికాయత్ ప్రసంగించారు. గతంలో రైతు ఉద్యమ సమయంలో రాకేష్ టికాయత్ రైతు నాయకుడిగా గుర్తింపు పొందారు. రైతుల్ని అందర్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాడారు.
