యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది. బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ఇక ఇదే బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. అయితే గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాల నినాదాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేశారు.
గురువారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు. అయితే ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలో కూడా ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రతిపక్షాలకు ఎలాంటి స్పష్టమైన అజెండా లేదని, వారు చర్చలు జరగకుండా అడ్డుకుంటున్నారని సభా నాయకుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సభలో పత్రాలు, నివేదికలు సమర్పించిన అనంతరం మంత్రుల ప్రకటనలు కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన ప్రారంభించారు.
ఇదిలా ఉండగా.. ప్రజా పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీక్‌లు, అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన చట్టాన్ని మరింత కఠినతరం చేసే ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్-2026’కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు విధించేలా ఈ బిల్లులో సవరణలు చేశారు. అనుభవాల నుంచి నేర్చుకునేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఆ ఉద్దేశంతోనే పేపర్ లీక్ నిరోధక చట్టంలో మరింత కఠినమైన నిబంధనలను తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జూలై 27న ఈ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఉద్యమం తీవ్రస్థాయికి చేరడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ పరిణామాల అనంతరం ప్రభుత్వం పేపర్ లీక్‌లను అరికట్టేందుకు చట్టాన్ని మరింత పటిష్టం చేసే చర్యలు చేపట్టింది.
లోక్‌సభలో బుధవారం మాట్లాడిన జితేంద్ర సింగ్.. నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని తెలిపారు. 2024లో పేపర్ లీక్ నిరోధక చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 52 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

