Site icon NTV Telugu

Rajnath Singh: భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్‌తో పాక్ రుచిచూసింది

Rajnathsingh

Rajnathsingh

భారత్ బలమేంటో ఆపరేషన్ సిందూర్‌తో మన దళాలు పాకిస్థాన్‌కు రుచిచూపించాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. దసరా సందర్భంగా భుజ్‌లో సైనిక దళాలతో కలిసి రాజ్‌నాథ్‌సింగ్ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌‌సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా సర్ క్రీక్ ప్రాంతంలో సరిహద్దు వివాదం రేగుతోందని.. చర్చల ద్వారా పరిష్కరించడానికి భారతదేశం అనేక ప్రయత్నాలు చేసిందని తెలిపారు. కానీ పాకిస్థాన్ ఉద్దేశాలు మాత్రం స్పష్టంగా కనిపించడం లేదని చెప్పారు. ప్రస్తుతం సర్‌క్రీక్ ప్రాంతంలో పాక్ దళాలు మోహరించే ప్రయత్నం చేస్తోందని.. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా దురాక్రమణకు పాల్పడితే మాత్రం బలమైన ప్రతిస్పందన ఉంటుందని.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్‌సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ భార్య సంచలన ఆరోపణలు

భారత బలానికి సైన్యం, వైమానిక దళం, నావికాదళం మూడు స్తంభాలుగా రాజ్‌నాథ్‌సింగ్ అభివర్ణించారు. ఈ మూడు సేవలు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మనం ప్రతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కోగలం అని తెలిపారు. ఆయుధాలు ధర్మాన్ని స్థాపించడానికి ఒక సాధనమని నమ్ముతున్నట్లు చెప్పారు. ఉగ్రవాదాన్నైనా.. మరే ఇతర సమస్య అయినా ఎదుర్కోవడానికి… ఓడించడానికి భారత్‌కు సామర్థ్యం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ సత్తా ఏంటో పాకిస్థాన్ రుచి చూసిందని పేర్కొన్నారు. భారత్ దళాలు పాకిస్థాన్‌పై ఎప్పుడు, ఎక్కడైనా, ఎలా కావాలంటే అప్పుడు భారీ నష్టాన్ని కలిగించగలవని ప్రపంచానికి ఒక సందేశం పంపించిందని తెలిపారు. పరిస్థితిని తీవ్రతరం చేయడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదన్నారు. ఉగ్రవాదంపై పోరాటం మాత్రం కొనసాగుతుందని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు మోడీ ఫోన్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

భారత్ సైన్యం, బీఎస్ఎఫ్ సంయుక్తంగా భారత సరిహద్దులను కాపాడుతున్నాయని తెలిపారు. ఒకవేళ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ వైపు నుంచి మాత్రం ఏదైనా దుస్సాహసం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా 1965 యుద్ధాన్ని గుర్తుచేశారు. అప్పుడు భారత బలగాలు లాహోర్‌కు వెళ్లగలిగే సత్తాను ప్రదర్శించాయన్నారు. ఇప్పుడిది 2025 అని గుర్తుపెట్టుకోవాలని రాజ్‌నాథ్‌ చురకలు అంటించారు.

సర్ క్రీక్ అనేది గుజరాత్‌లోని కచ్-పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ మధ్య ఉన్న 96 కి.మీల నదీముఖద్వారం. ఈ నదీ ముఖద్వారం మధ్యలో సరిహద్దు ఉండాలని భారతదేశం చెబుతోంది. పాకిస్థాన్ మాత్రం భారతదేశానికి సరిహద్దు తూర్పు ఒడ్డున ఉండాలని వాదిస్తోంది.

Exit mobile version